Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!

నీతీశ్‌ క్యాబినెట్‌లో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కార్తికేయ సింగ్‌పై (Kartikeya Singh) అరెస్టు వారెంటు ఉందన్న విషయాన్ని బయటకు తీసిన భాజపా నేతలు.. అటువంటి నేతకు న్యాయశాఖను ఎలా అప్పగిస్తారని మండిపడుతున్నారు.

Published : 17 Aug 2022 23:16 IST

నీతీశ్‌ ప్రభుత్వంపై భాజపా మండిపాటు

పట్నా: బిహార్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరిన కొన్ని గంటలకే నీతీశ్‌ కుమార్‌కు (Nitish Kumar) కొత్త తలనొప్పులు మొదలైనట్లు కనిపిస్తోంది. నీతీశ్‌ కేబినెట్‌లో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కార్తికేయ సింగ్‌పై (Kartikeya Singh) అరెస్టు వారెంటు ఉందన్న విషయాన్ని బయటకు తీసిన భాజపా నేతలు.. అటువంటి నేతకు న్యాయశాఖను (Law Minister) ఎలా అప్పగిస్తారని మండిపడుతున్నారు. వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర విలేకర్లు ప్రస్తావించగా.. ‘ఆ కేసు గురించి నాకు తెలియదు’ అంటూ నీతీశ్‌ కుమార్‌ బదులిచ్చారు.

ఆర్జేడీ సహాయంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా.. మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) వర్గం నుంచి 16మందికి, మరో 11 మంది నీతీశ్‌ పార్టీ నేతలకు మంత్రులుగా చోటు లభించింది. ఇందులో తేజస్వి పార్టీకి చెందిన కార్తికేయ సింగ్‌పై గతంలో కిడ్నాప్‌ కేసుకు సంబంధించి అరెస్టు వారెంటు ఉన్నట్లు తేలింది. ఈ కేసులో ఆగస్టు 16నే దానాపూర్‌ కోర్టు ముందు ఆయన లొంగిపోవాల్సి ఉండగా.. అదేరోజే ఆయన న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. దీనిపై స్పందించిన మంత్రి కార్తికేయ్‌ సింగ్‌.. ఎమ్మెల్సీ పదవి చేపట్టే సమయంలోనే ఆ కేసు గురించి అఫిడవిట్‌లో ప్రస్తావించానని పేర్కొన్నారు. ఆ కేసులో తనపై తప్పుడు అభియోగాలు నమోదు చేశారని, తనపై ఎటువంటి వారెంట్‌ లేదని చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఐతే స్థానిక పోలీసులు మాత్రం ఆయనపై వారెంటు ఉన్న విషయాన్ని ధ్రువీకరించారు.

తేజస్వి యాదవ్‌ పార్టీకి (RJD) చెందిన కార్తికేయ సింగ్‌.. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే, 2014లో చోటుచేసుకున్న ఓ కిడ్నాప్‌ వ్యవహారంలో కార్తికేయతోపాటు మరో 16 మందిపై కేసు నమోదయ్యింది. ఓ బిల్డర్‌ను హత్య చేసేందుకు కిడ్నాప్‌ చేశారనే అభియోగాలపై వారిపై కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని లేవనెత్తిన బిహార్‌ భాజపా నేత సుశీల్‌ కుమార్‌ మోదీ.. కిడ్నాప్‌ కేసులో వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తిని మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వెంటనే ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించాలన్నారు. లాలుప్రసాద్‌ నాటి రోజుల్లోకి పాలనను తీసుకెళ్తున్నారా అని నీతీశ్‌ కుమార్‌ను ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని