‘అప్పుడు మోదీ దాచిపెట్టారా..?’: వయనాడ్ నుంచి ప్రియాంక పోటీపై భాజపాకు కాంగ్రెస్ కౌంటర్

రాహుల్ గాంధీ వయనాడ్(Wayanad) స్థానాన్ని వదులుకోవడంతో అక్కడినుంచి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు. దీనిపై భాజపా చేసిన విమర్శలకు కాంగ్రెస్ బదులిచ్చింది. 

Published : 18 Jun 2024 12:20 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించడంతో రాయ్‌బరేలీనే అట్టిపెట్టుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నిర్ణయించుకున్నారు. మరోస్థానం కేరళలోని వయనాడ్ (Wayanad) నుంచి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పోటీ చేయనున్నారు. ఆమెను బరిలోకి దింపడంపై భాజపా స్పందించింది. వారసత్వ రాజకీయాలు అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది.

కాంగ్రెస్ ప్రజలకు ద్రోహం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. ‘‘రాహుల్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే విషయాన్ని దాచిపెట్టి.. తమ కుటుంబం నుంచి ఒకరి తర్వాత ఒకరిని వయనాడ్ ఓటర్లపై రుద్దడం సిగ్గుచేటు చర్య.  రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఓడిపోవడానికి ఈ ద్రోహ విధానమే కారణం’’ అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు పెట్టారు. దీనిపై హస్తం పార్టీ నుంచి అదేస్థాయిలో స్పందన వచ్చింది. 2014లో వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని మోదీ వడోదర ప్రజల వద్ద దాచిపెట్టారా..? అంటూ ఘాటుగా ప్రశ్నించింది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో.. గుజరాత్‌లోని వడోదరతో పాటు యూపీలోని వారణాసి నుంచి మోదీ పోటీ చేశారు. రెండుచోట్లా విజయం సాధించడంతో వడోదర సీటును వదులుకున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. ఇదిలా ఉంటే.. వయనాడ్‌ నుంచి ప్రియాంక ఎన్నికైతే తొలిసారిగా పార్లమెంటులోకి ఆమె అడుగుపెడతారు. ఈ స్థానంలో రాహుల్‌పై సీపీఐకి చెందిన అన్నీ రాజా, భాజపాకు చెందిన సురేంద్రన్ పోటీ చేశారు. అయితే ఇప్పుడు అన్నీ రాజా బరిలో ఉంటారో, లేదో తెలియాల్సిఉంది. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ప్రియాంక చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని