Maharashtra: ముస్లిం కోటా అమలు వివాదం.. ఎంఐఎంపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

మహారాష్ట్రలో ముస్లింలకు అయిదు శాతం రిజర్వేషన్‌ అమలు అంశం.. మరోసారి పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. ఈ కోటాను అమలు చేయడంలో కాంగ్రెస్‌- ఎన్సీపీలు విఫలమయ్యాయని శనివారం ముంబయిలో జరిగిన ఓ ర్యాలీలో ఏఐఎంఐఎం...

Published : 12 Dec 2021 23:20 IST

ముంబయి: మహారాష్ట్రలో ముస్లింలకు అయిదు శాతం రిజర్వేషన్‌ అమలు అంశం మరోసారి పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. ఈ కోటాను అమలు చేయడంలో కాంగ్రెస్‌- ఎన్సీపీలు విఫలమయ్యాయని శనివారం ముంబయిలో జరిగిన ఓ ర్యాలీలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించగా.. ఆదివారం కాంగ్రెస్‌ ప్రతిదాడి చేసింది. రాష్ట్రంలో 2014- 2019 మధ్య భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై ఎంఐఎం ఎందుకు మౌనంగా ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నసీమ్ ఖాన్ ప్రశ్నించారు. విద్యాసంస్థల ప్రవేశాల్లో ముస్లింల కోటాను బాంబే హైకోర్టు సమర్థించిందని, దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వమే దాన్ని అమలు చేయలేదని ఆరోపించారు.

‘భాజపా అధికారంలో ఉన్నప్పుడు కోటా అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తతను తాము నిలదీసిన సందర్భాల్లో.. ఎంఐఎం మౌనంగా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ విషయమై ఒక్కసారి కూడా తమ గొంతును వినిపించలేదు. పైపెచ్చు భాజపాను సమర్థించారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు’ అని నసీమ్‌ ఖాన్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.

ముంబయిలో శనివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ.. అధికారం కోసం కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనతో చేతులు కలిపాయని, ముస్లింలకు ఉద్యోగాలు, విద్యలో అయిదు శాతం కోటా అమలు చేస్తామన్న హామీని మరిచిపోయాయని విమర్శించారు. 2014లో మహారాష్ట్రలోని కాంగ్రెస్- ఎన్‌సీపీ ప్రభుత్వం ముస్లింలకు ఉద్యోగాలు, విద్యాప్రవేశాల్లో అయిదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు మాత్రం విద్యారంగంలో ముస్లిం కోటాను సమర్థించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని