పాలక్కడ్‌ నుంచి మెట్రోమ్యాన్‌

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రకటించింది. మొత్తం 140 స్థానాలకు గానూ 112 మంది అభ్యర్థులను పేర్లను ప్రకటించింది. 115 స్థానాలకు పోటీ చేస్తున్నామ......

Updated : 14 Mar 2021 16:56 IST

దిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రకటించింది. మొత్తం 140 స్థానాలకు గానూ 112 మంది అభ్యర్థులను పేర్లను ప్రకటించింది. 115 స్థానాలకు పోటీ చేస్తున్నామని, మిగిలిన స్థానాలను ఇతర పార్టీలకు కేటాయించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ తెలిపారు. ‘మెట్రోమ్యాన్‌’ శ్రీధరన్‌ పాలక్కడ్‌ నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ రెండు స్థానాల నుంచి (మంజేశ్వర్‌, కొన్ని) పోటీ చేయనున్నారు.

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమ్మనమ్‌ రాజశేఖరన్‌కు నెమ్మమ్‌ సీటు కేటాయించారు. కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్‌కు కంజిరిప్పళ్లి స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. నటుడు సురేష్‌ గోపీ త్రిస్సూర్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఏప్రిల్‌ 6న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. మే2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. రాష్ట్రంలో కొన్ని స్థానాలనైనా ఒడిసి పట్టాలని భాజపా పట్టుదలతో ఉంది.

బెంగాల్‌లో 63 స్థానాలకు
బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడు, నాలుగు విడతల్లో జరగబోయే స్థానాలకు 63 మంది అభ్యర్థుల జాబితాను భాజపా ప్రకటించింది. ఆర్థిక శాఖ మాజీ ముఖ్య సలహాదారు అశోక్‌ లాహిరి అలీపుర్దౌర్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు తొల్లిగుంజె స్థానం కేటాయించారు. 

కుష్బూ అక్కడి నుంచే..
ఇక తమిళనాడు విషయానికొస్తే ఇటీవల పార్టీలో చేరిన కుష్బూ సుందర్‌కు థౌజెండ్‌ లైట్స్‌ అసెంబ్లీ సీటును కేటాయించారు. పార్టీ మహిళా సెల్‌ చీఫ్‌ వనతి శ్రీనివాసన్‌.. కమల్‌హాసన్‌ పోటీగా దక్షిణ కోయంబత్తూరు నుంచి పోటీ చేయనున్నారు. మొత్తం 20 స్థానాల్లో భాజపా పోటీ చేయనుండగా.. 17 స్థానాలకు తాజాగా అభ్యర్థులను ప్రకటించింది. ఇక అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 17 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు గాను 92 స్థానాల్లో అభ్యర్థులను భాజపా నిలబెట్టనుంది. మిగిలిన సీట్లు మిత్రపక్షాలకు కేటాయించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని