విదేశీ గడ్డ మీద భారత్‌పై విమర్శలా?.. పాక్‌ కూడా ఆ సాహసం చేయలేదు: భాజపా

BJP on Rahul Gandhi: విదేశీ గడ్డ మీద భారత్‌పై విమర్శలు చేశారంటూ రాహుల్‌ గాంధీపై భాజపా మండిపడింది. పాక్‌ సైతం ఏ రోజూ ఆ సాహసం చేయలేదని పేర్కొంది.

Updated : 04 Mar 2023 16:44 IST

దిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తన విమర్శల దాడిని ఉద్ధృతం చేసింది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. పొరుగు దేశం పాక్‌ సైతం ఎప్పుడూ ఆ సాహసం చేయలేదని పేర్కొంది. భారత్‌ గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే.. విదేశీ గడ్డపై ప్రతిపక్ష నేత ఇలా మాట్లాడాతారా అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా విమర్శించారు.

చైనా నుంచి తమ పెట్టుబడులను భారత్‌కు తరలించాలని పెట్టుబడిదారులు భావిస్తున్న వేళ.. వారిని వెనక్కి పంపాలని రాహుల్‌ గాంధీ చూస్తున్నారని సంబిత్‌ పాత్రా విమర్శించారు. ఓ పెద్ద యూనివర్సిటీ వేదికగా భారత్‌ గురించి రాహుల్‌ అసత్యాలు చెప్పారని, దాయాది దేశం పాక్‌ కూడా ఎప్పుడూ విదేశీ గడ్డపై ఆ సాహసం చేయలేదని విమర్శించారు. డబ్బులు తీసుకునే ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

దేశంలో మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తున్నారంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను సంబిత్‌ పాత్రా తప్పుబట్టారు. భారత్‌ కీర్తి ప్రతిష్ఠలను మంటగలిపేందుకు రాహుల్‌ గాంధీ, ఆయన కుటుంబం ఎంతకైనా దిగజారుతుందని మండిపడ్డారు. తన ఫోన్‌లో పెగాసస్‌ వైరస్‌ను జొప్పించారన్న ఆరోపణలనూ సంబిత్‌ పాత్రా తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీకి రాహుల్‌ గానీ, ఆ పార్టీ నేతలు గానీ పరిశీలించేందుకు ఫోన్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. యూపీఏ హయాంలోనే వేలాది ఫోన్లు ట్యాప్‌ చేశారని, ఈ-మెయిల్స్‌ను చదివారని ఆర్‌టీఐ దరఖాస్తులో తేటతెల్లమైందన్నారు. జీ20 దేశాలకు భారత్‌ అధ్యక్షత వహిస్తున్న వేళ ఈ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని