అసోంలో సీఏఏ అమలు కానివ్వం: రాహుల్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్‌ ద్వేషాన్ని నిర్మూలిస్తుంటే..

Published : 20 Mar 2021 19:08 IST

గువహటి: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్‌ ద్వేషాన్ని నిర్మూలిస్తుంటే.. భాజపా దాన్ని వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం అసోంలోని జోర్హాత్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ద్వేషాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంటే.. భాజపా దాన్ని ఇంకా వ్యాప్తి చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ కేవలం దేశంలో కుబేరులైన పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారు. ప్రజల జేబుల్లోని డబ్బును ఆయన వారికి కట్టబెడుతున్నారు’ అని రాహుల్‌ విమర్శించారు. 

‘ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండానే వ్యవసాయ బిల్లులను ఆమోదించారు. కనీసం ఆ బిల్లులపై పార్లమెంట్‌ చర్చలోనూ మమ్మల్ని మాట్లాడనీయకుండా చేశారు. అయినప్పటికీ మేం గట్టిగా నిలబడ్డాం. ఏదేమైనా ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రైతులకు అండగానే ఉంటాం. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలును కానివ్వం. మేం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు తీసుకువస్తాం.  భాజపా వివిధ ప్రాంతాల్లో విభిన్న హామీలను ఇస్తోంది. నేను ఎప్పటికీ మోసం చేయను. ఇతర రాష్ట్రాల్లో మేం ఇదివరకు ఇచ్చిన హామీలను గమనించండి. అవి ఎంతవరకు అమలు చేశామో కూడా చూడండి’ అని రాహుల్‌ వెల్లడించారు. అంతకుముందు రాహుల్‌ దిగ్బోయ్‌ ప్రాంతంలో నిర్వహించిన ఐఓసీ(ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌) ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని