Gujarat: 37ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌.. భాజపా గుజరాత్‌ స్కోర్‌ 156

గుజరాత్‌ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) భాజపా (BJP) సరికొత్త చరిత్ర లిఖించింది. ఏకంగా 156 స్థానాల్లో విజయఢంకా మోగించి అత్యధిక మెజార్టీ దక్కించుకుంది.

Updated : 08 Dec 2022 18:54 IST

గాంధీనగర్‌: తమ కంచుకోట అయిన గుజరాత్‌ (Gujarat)లో కమలనాథులు మళ్లీ విజయనాదం మోగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly election Results) వరుసగా ఏడోసారి విజయం సాధించడంతో పాటు 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టి అత్యధిక స్థానాలతో భాజపా (BJP) సరికొత్త చరిత్ర లిఖించింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాషాయ పార్టీ ఏకంగా 156 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ ఈ స్థాయిలో సీట్లు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1985లో కాంగ్రెస్‌(Congress) అప్పటి నేత మాధవ్‌సిన్హ్‌ సోలంకీ సారథ్యంలో అత్యధికంగా 149 సీట్లతో విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును భాజపా బ్రేక్‌ చేసింది.

గుజరాత్‌లో 1962 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలుత 154 నియోజకవర్గాలుండగా.. 1972 తర్వాత 182 నియోజకవర్గాలకు పెంచారు. 1980లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) పార్టీ 141 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లోనూ అదే ఉత్సాహం కొనసాగించిన హస్తం పార్టీ.. 149 సీట్లతో విజయఢంకా మోగించింది. ఆ తర్వాత ఏ పార్టీకి కూడా ఆ స్థాయిలో మెజార్టీ దక్కలేదు.

ఇక, 1995లో తొలిసారి అధికారంలోకి వచ్చిన భాజపా(BJP).. 121 సీట్లతో విజయం సాధించింది. అప్పటి నుంచి వరుసగా అధికారంలో కొనసాగుతూ వస్తోన్న కమలం పార్టీ.. 2002లో 127 స్థానాలు దక్కించుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో తన సొంత రికార్డును బద్దలుకొట్టిన భాజపా.. చరిత్రను తిరగరాసింది. ఏకంగా 156 స్థానాల్లో విజయం సాధించి.. ప్రతిపక్షాలకు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది.

దేశంలోనే రెండోసారి..

గుజరాత్‌లో గత ఆరు దఫాలుగా భాజపానే అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లోనూ కాషాయ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి ఒకే పార్టీ విజయం సాధించడం దేశంలో ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌ను సీపీఎం వరుసగా 34 ఏళ్ల పాటు(1977 నుంచి 2011 వరకు) పాలించింది. ఆ తర్వాత వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన పార్టీగా భాజపా రికార్డు సాధించింది.

గురువారం వెలువడిన ఫలితాల్లో భాజపా 156 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ కేవలం 17 స్థానాలకు పరిమితమైంది. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీకి 5 సీట్లు దక్కగా.. మరో నాలుగు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని