UP Election 2022 : లతా మంగేష్కర్‌ మరణం.. యూపీ భాజపా మేనిఫెస్టో విడుదల వాయిదా!

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ (92) మరణంతో ఎన్నికల మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా ప్రకటించింది.

Updated : 06 Feb 2022 14:08 IST

యూపీ భాజపా నిర్ణయం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ అన్ని రాజకీయపార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అధికార భాజపా ఆదివారం నాడు మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం అగ్రనేతలు లఖ్‌నవూ చేరుకున్నారు. ఇదే సమయంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ (92) మరణంతో ఆమెక గౌరవ సూచికంగా ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఫిబ్రవరి 10న ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలివిడత పోలింగ్‌ జరుగుతున్నందున.. ఎన్నికల ప్రచారాన్ని అధికార భాజపా ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం నాడు పార్టీ మేనిఫెస్టో విడుదల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, స్వతంత్ర దేవ్‌, కేశవ్‌ మౌర్య వంటి కీలక నాయకులు లఖ్‌నవూ చేరుకున్నారు. ఇదే సమయంలో గాయని లతా మంగేష్కర్‌ మరణం చెందారనే వార్త తెలిసింది. దీంతో మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు ఆమెకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఇక లతా మంగేష్కర్‌ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్న ఆయన.. ఆమెతో గతంలో జరిపిన సంభాషణలు మరువలేనివని గుర్తుచేశారు. ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు ప్రధాని మోదీ ఈ మధ్యాహ్నం ముంబయి చేరుకోనున్నారు. మరోవైపు లతా మంగేష్కర్‌ మరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని