Morbi:మోర్బీ గుర్తుందా?.. అక్కడ భాజపాదే విజయం..

మోర్బీ నియోజవర్గం లోనూ భాజపా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కాంతిలాల్‌ అమృతీయ 61,500 భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, ఈ స్థానంలో భాజపా విజయం ఎందుకంత ప్రత్యేకం?

Published : 08 Dec 2022 19:08 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌( Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయదుందుభి మోగించింది. 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించింది. కానీ, ఈ సారి అందరి దృష్టినీ ఆకర్షించిన మోర్బీ(Morbi) స్థానంలోనూ భాజపా విజయం సాధించడాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఎందుకుంటే పోలింగ్‌కు సరిగ్గా 35 రోజుల ముందే ఈ నియోజవర్గ పరిధిలో ఓ పెద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. మోర్బీలో వంతెన కూలిపోవడంతో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని అందరూ భావించారు. కాంగ్రెస్‌,ఆప్‌లు కూడా తన ప్రచారంలో ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించాయి. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పార్టీ అభ్యర్థి కాంతిలాల్‌ అమృతీయ (Kantilal Amrutiya) 61,500 ఓట్ల భారీ మెజార్టీతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి జయంతిలాల్‌ పటేల్‌పై ఘన విజయం సాధించారు.

1995 నుంచి 2012 వరకు వరుసగా ఐదుసార్లు ఇదే స్థానం నుంచి విజయం సాధించిన కాంతీలాల్‌.. 2017లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి బ్రిజేశ్‌ మెర్జా చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం భాజపాలో చేరిన బ్రిజేశ్‌.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇటీవల మోర్బీలో వంతెన కూలిన సమయంలో కాంతిలాల్‌ అమృతీయ పేరు బాగా పాపులర్‌ అయ్యింది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన ఆయన.. నీళ్లలో దూకి మరీ బాధితులను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని