karnataka elections: ఫలించని బ్రహ్మానందం ప్రచారం.. హీరో నిఖిల్‌కు మరో ఫ్లాప్‌.. గాలి కుటుంబానికి నిరాశ

Karnataka Election Results 2023: కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కథానాయకుడు, మాజీ సీఎం తనయుడు నిఖిల్‌ గౌడ ఓటమి పాలయ్యారు. అలాగే గాలి జనార్థన్‌రెడ్డి కుటుంబంలో ఆయన ఒక్కరే విజయం సాధించారు.

Updated : 13 May 2023 17:12 IST

Karnataka Election Results 2023: కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు అభ్యర్థుల తరపున సినీ నటులు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఎన్నికల ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి, మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని తెలుగులో విన్నవించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సుధాకర్‌ ఓటమి పాలయ్యారు.

చిక్కబళ్లాపుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రదీప్‌ ఈశ్వర్‌ 11,130 ఓట్ల మెజార్టీతో సుధాకర్‌పై విజయం సాధించారు. ఈ ఫలితాల్లో ఈశ్వర్‌కు 69,008 ఓట్లు రాగా, సుధాకర్‌కు 57878 ఓట్లు మాత్రమే పడ్డాయి. (Karnataka Election Results 2023) జేడీఎస్ అభ్యర్థి కేపీ బచే గౌడ 13,300 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మంత్రి సుధాకర్‌తో తనకు మొదటి నుంచి పరిచయం ఉండడం, వైద్యునిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు తెలిసి ప్రచారానికి వచ్చానని అప్పుడు బ్రహ్మానందం చెప్పారు. చిక్కబళ్లాపురలో నటుడు దర్శన్‌, లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌లతో కలిసి సుధాకర్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు.


హీరో నిఖిల్ గౌడ ఓటమి..

ప్రస్తుత ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా అవతరిస్తుందనుకున్న జేడీఎస్‌ తనదైన ప్రభావాన్ని చూపలేకపోయింది. 20 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కీలక నియోజకవర్గంగా రామనగర కూడా నిలిచింది. అందుకు కారణం మాజీ సీఎం కుమారస్వామి తనయుడు హీరో నిఖిల్ గౌడ (Nikhil Gowda) అక్కడి నుంచి పోటీ చేయడమే. ‘జాగ్వర్‌’తో ఇక్కడ తెలుగువారికీ నిఖిల్‌ గౌడ సుపరిచితుడే. తాజా ఎన్నికల్లో కుమార‌స్వామి భార్య రామ‌న‌గ‌ర నుంచి టికెట్‌ను త్యాగం చేసి తనయుడు నిఖిల్ కుమార‌గౌడ‌కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో రామనగర స్థానంలో నిఖిల్ గౌడ (జేడీఎస్) ఇక్బాల్ హుస్సేన్ (కాంగ్రెస్) మరిలింగగౌడ (భాజపా) పోటీపడ్డారు. ఈ త్రిముఖపోరులో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్‌ హుస్సేన్‌ దాదాపు 10వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.(Karnataka Election Results 2023) హుస్సేన్‌కు 87,285 ఓట్లు రాగా, నిఖిల్‌ గౌడకు 76,439 ఓట్లు వచ్చాయి. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్‌పై జేడీ(ఎస్) అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి విజయం సాధించగా, ఇప్పుడు ఆయన తనయుడు ఓటమి పాలయ్యారు. 2019లో మండ్య లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసిన నిఖిల్.. సుమలత చేతిలో ఓడిపోయారు. అటు సినీ కెరీర్‌, ఇటు రాజకీయ రంగంలోనూ నిఖిల్‌ తనదైన ముద్రవేయలేకపోయారు.


గాలి కుటుంబానికి నిరాశ మిగిల్చిన ఎన్నికలు

తాజా ఎన్నికల ఫలితాలు వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డి కుటుంబానికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. జనార్దనరెడ్డి మినహా పోటీలో ఉన్న కుటుంబసభ్యులెవరూ విజయం సాధించలేదు. ఆయన సోదరులు సోమశేఖరరెడ్డి, కరుణాకర్​రెడ్డి భాజపా తరఫున పోటీ చేయగా.. భార్య లక్ష్మీ అరుణ, జనార్దనరెడ్డి సొంత పార్టీ కల్యాణ రాజ్యప్రగతి పక్ష అభ్యర్థులుగా బరిలో నిలిచారు. బళ్లారి పట్టణ నియోజకవర్గంలో గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి (భాజపా), భార్య లక్ష్మీ అరుణ(కేఆర్‌పీపీ)లను కాదని కాంగ్రెస్​ అభ్యర్థి నారా భరత్‌రెడ్డికి ఓటర్లు విజయాన్ని అందించారు. (Karnataka Election Results 2023) హరపనహళ్లి నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన కరుణాకర్​రెడ్డి.. ప్రత్యర్థి లతా మల్లిఖార్జున్‌ (కాంగ్రెస్‌) చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆయన సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు సైతం కాంగ్రెస్ ​అభ్యర్థి నాగేంద్ర చేతిలో ఓడిపోయారు.

కల్యాణ రాజ్యప్రగతిపక్ష పేరుతో పార్టీని స్థాపించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచారు గాలి జనార్థన్‌రెడ్డి. అయితే, తాజా ఫలితాల్లో ఆయన ఒక్కరే విజయం సాధించడం విశేషం. గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్​ అభ్యర్థి ఇక్బాల్‌ అన్సారీపై గెలుపొందారు. బళ్లారి సిటీ నియోజకవర్గంలో తన సోదరుడు, భాజపా నేత సోమశేఖరెడ్డిపై భార్య లక్ష్మీని కేఆర్​పీపీ అభ్యర్థిగా పోటీకి దింపగా ఇద్దరూ పరాజయం పాలయ్యారు. గాలి కుటుంబానికి కంచుకోటగా ఉన్న బళ్లారి పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌ రెడ్డి విజయం సాధించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని