Bandi sanjay: రూ.228 కోట్ల పంట నష్టపరిహారం ఇంకా ఎందుకివ్వలేదు.. కేసీఆర్‌కు సంజయ్‌ లేఖ

గత నెలలో ఇస్తానన్న రూ.228 కోట్ల పంట నష్టపరిహారం ఇప్పటివరకు ఎందుకివ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

Updated : 26 Apr 2023 23:14 IST

హైదరాబాద్‌: అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. యాసంగి సీజన్‌లోనే రైతులు పంట నష్టపోవడం ఇది రెండోసారి అని లేఖలో పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 9 లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతిందన్నారు. గత మూడేళ్లలో మొత్తం 37 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వివరించారు. లక్షలాది మంది రైతులపై కోలుకోలేని దెబ్బపడిందని బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

కౌలు రైతుల పరిస్థితి వర్ణణాతీతమని.. ప్రభుత్వం ఆదుకోకుంటే వారికి ఆత్మహత్యే శరణ్యమని గుండెలవిసేలా రోదిస్తున్నారన్నారు. గత నెలలో ఇస్తామన్న రూ.228 కోట్ల పంట నష్టపరిహారం ఇప్పటివరకు ఎందుకివ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఐదురోజులుగా వర్షాలతో రైతులు అల్లాడుతుంటే మీరు, వ్యవసాయశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని కేసీఆర్‌ను నిలదీశారు. రైతులు నీటమునిగిన వరి కంకులపై పడి రోదిస్తుంటే మనసు కరగడంలేదా? అంటూ మండిపడ్డారు. రైతులు ఏడుస్తుంటే భారాస మంత్రులు, ఎమ్మెల్యేలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారా? అని ధ్వజమెత్తారు. రైతుల కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా అని నిలదీశారు. 

మీది కిసాన్ సర్కార్ అంటే నమ్మేదెలా..

గత మూడేళ్లలో 37 లక్షల ఎకరాల్లో జరిగిన పంట నష్టం విలువ రూ.18,500 కోట్లు అని సంజయ్‌ లేఖలో ప్రస్తావించారు. పంట నష్టం సాయం చేయని ‘మీది కిసాన్ సర్కార్ అంటే నమ్మేదెలా’ అని ప్రశ్నించారు. ఎన్నికల ఏడాది కావడంతో పంట నష్టం అంచనా పేరుతో రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం అంచనా నివేదిక తెప్పించాలని డిమాండ్ చేశారు. తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. భూమిని నమ్ముకుని సేద్యం చేస్తున్న 14 లక్షల మంది కౌలు రైతులను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేయాలని.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లోనైనా ఉచిత ఎరువులు, విత్తనాలు అందజేసి రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. తక్షణమే సమగ్ర పంటల బీమా పథకం రూపొందించాలని సంజయ్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని