బెంగాల్‌కు పూర్వవైభవం తెస్తాం: నడ్డా

పశ్చిమబెంగాల్‌లో భాజపా అధికారంలోకి వస్తే పీఎం కిసాన్‌ యోజన పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. బెంగాల్‌ పర్యటనకు విచ్చేసిన నడ్డా.. గురువారం ఉదయం కోల్‌కతాలో ‘సోనార్‌ బంగ్లా మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Updated : 25 Feb 2021 15:23 IST

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో భాజపా అధికారంలోకి వస్తే రైతులకు పీఎం కిసాన్‌ యోజన పథకంతో లబ్ధి చేకూరుస్తామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హామీనిచ్చారు. బెంగాల్‌ పర్యటనకు విచ్చేసిన నడ్డా.. గురువారం ఉదయం కోల్‌కతాలో ‘సోనార్‌ బంగ్లా మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మేం అధికారంలోకి వస్తే బెంగాల్‌ సంస్కృతికి కొత్తదనాన్ని తీసుకువస్తాం. అవినీతి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం. రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు ముగింపు పలుకుతాం. తిరిగి బెంగాల్‌కు మేం పూర్వ వైభవం తీసుకువస్తాం’ అని నడ్డా చెప్పారు. 

‘‘పశ్చిమబెంగాల్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, బంకించంద్ర ఛటర్జీ, శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, ఈశ్వరచంద్రవిద్యాసాగర్‌ ఈ గడ్డపైనే పుట్టారు. వారి త్యాగాల స్ఫూర్తితో ‘సోనార్‌ బంగ్లా’ను నిర్మిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మేం 30వేల బాక్సులు ఏర్పాటు ద్వారా.. ప్రజల నుంచి 2కోట్ల సూచనలను స్వీకరించనున్నాం. బెంగాల్‌లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని 73లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ లబ్ధి చేకూర్చుతాం. గతంలో రాష్ట్రానికి విడతల వారీగా కేటాయించిన కిసాన్‌ యోజనా నిధులను సైతం అధికారంలోకి రాగానే వేస్తాం. రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రభావం ప్రబలంగా ఉంది. కానీ ఇక్కడి ప్రభుత్వం దాన్ని అరికట్టడంలో విఫలమైంది’’ అని నడ్డా విమర్శించారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని