Hyd News: ఖైరతాబాద్‌ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్ల ఆందోళన

హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఖైరతాబాద్‌ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.

Updated : 26 Apr 2022 12:21 IST

పంజాగుట్ట: హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఖైరతాబాద్‌ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలుషిత నీటిని నివారించాలంటూ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఖాళీ కుండలతో నిరసన తెలిపారు. భాజపా నాయకులు గౌతమ్‌ రావు, శ్రీశైలంగౌడ్‌, శ్యాం సుందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘నగరంలో కలుషిత నీళ్లు తాగి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదు. నిజాం కాలంలో వేసిన పైపులైన్లే ఇప్పటికీ ఉన్నాయి. కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలను విమర్శించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు?హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలి. వర్షాకాలం సమీపిస్తున్నా నాలాల్లో పూడిక తీయడం లేదు. శివారు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలను జలమండలి గాలికొదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బోర్డుకు ఇస్తానన్న రూ.500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కలుషిత నీళ్లు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి. తాగునీటికి, డ్రైనేజీకి కొత్త పైపులైన్లు వేయాలి. పది రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం. 

నగరంలో మంచినీటి సరఫరా అరకొరగా ఉన్నప్పటికీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. కేంద్ర సహకారంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రంలో రహదారులు, వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు ఈ విషయంపై చర్చకు వస్తే ఎప్పుడైనా సిద్ధమే. నగరంలో పేద ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రతి వార్డులో నీటి సరఫరా కోసం అధునాతన యంత్రాలను ఏర్పాటు చేయాలి. మురుగు సమస్యల పరిష్కారంలో హైటెక్‌ మిషన్లు తెప్పించి శుభ్రపరచాలి’’ అని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని