gujarat assembly elections:‘పద్మ’వ్యూహంలో ప్రతిపక్షాలు కకావికలం..!
గుజరాత్(Gujarat) ఎన్నికలకు భాజపా(BJP) కేవలం మోదీ(Modi)ని నమ్ముకొని వెళ్లలేదు.. విజయానికి అవసరమైన గ్రౌండ్ వర్క్‌ను దాదాపు ఏడాదిన్నర నుంచే మొదలుపెట్టింది.
2017 ఎన్నికల సమయంలో గుజరాత్ కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్, అప్పటి గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి అశోక్ గహ్లోత్ చురుగ్గా వ్యూహరచన చేయడంతో భాజపా గట్టిపోటీని ఎదుర్కొంది. భాజపా 99 సీట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ ఆ మేరకు మెరుగుపడి 77 స్థానాలు గెలుచుకుంది. ఈ పరిణామం భాజపాలో ప్రమాదఘంటికలను మోగించింది. దీంతో ఈ సారి కమలనాథులు మొదటి నుంచే అప్రమత్తమై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో విజయానికి నరేంద్ర మోదీ చరిష్మానే భాజపా నమ్ముకున్నా.. క్షేత్రస్థాయిలో కూడా విపరీతంగా శ్రమించింది. ఈ క్రమంలో ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు మంత్రి వర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి కూడా వెనుకాడలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యూహాలన్నీ ఇప్పుడు ఫలితాన్నిచ్చి గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని కమలం పార్టీకి కట్టబెట్టాయి. 2002లో భాజపా 127 స్థానాలను గెలుచుకొంటే ఈ సారి ఆ రికార్డును బద్దలుకొట్టి కొత్త చరిత్ర లిఖించింది.
ప్రతి అడుగు పక్కా ప్రణాళికతో..
♦ ఎన్నికలకు ఏడాది ముందుగానే విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గాన్ని భాజపా పక్కనపెట్టి.. భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించింది. దీంతో రూపానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు చెక్‌పెట్టినట్లైంది. దీనికి తోడు పటేల్ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని బుజ్జగించినట్లైంది. అంతకు ముందే కేంద్ర మంత్రివర్గంలో కూడా ఓబీసీలకు స్థానాలను కల్పిస్తూ పునర్ వ్యవస్థీకరించింది. దేవశీష్ చౌహాన్, దర్శనా జర్దోష్, డాక్టర్ మహేంద్ర ముంజుపారకు స్థానం కల్పించింది. గుజరాత్‌లో 37శాతం ఉన్న ఈ ఓబీసీ ఓటర్లు 90 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగలరు.
♦ పనితీరు బాగోని 42 మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్లను నిరాకరిచింది. వీరిలో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ చర్యలు భాజపా ఇమేజ్‌ను పెంచాయి.
♦ 2017లో కాంగ్రెస్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌పటేల్‌ను భాజపా అక్కున చేర్చుకొంది. కీలక కులాలకు ప్రాతినిధ్యం వహించే నేతలను హస్తం వదులుకొంటే.. కమలం ఒడిసి పట్టింది. కున్వర్‌జీ బవలియా (కోలి), హార్దిక్ పటేల్ (పాటీదార్), అల్పేశ్ ఠాకూర్(ఓబీసీ) కాంగ్రెస్ నుంచి భాజపాకు వలస వచ్చారు.
♦ ఆత్మనిర్భర్ గుజరాత్ కార్యక్రమం కింద భాజపా 15లక్షల ఉద్యోగాలకు హామీ ఇవ్వడం ఆకర్షించింది. దీనికి తోడు వేదాంత-ఫాక్స్‌కాన్ సెమీకండెక్టర్ ప్లాంట్, టాటా -ఎయిర్ బస్ విమాన తయారీ యూనిట్ వంటి భారీ ప్రాజెక్టులు ఎన్నికల ముందు రాష్ట్రానికి రావడం కలిసొచ్చింది.
♦ సహకార సమాఖ్యలపై కమలనాధుల పట్టు ఈ ఎన్నికల్లో ఫలితాన్నిచ్చింది. ఎన్నికలకు ఏడాది ముందుగానే 2021 జులైలో హోం మంత్రి అమిత్‌షా చేతికి సహకారశాఖ పగ్గాలను కూడా అప్పగించడం దీనిలో భాగమే.
♦ గుజరాత్‌లో కీలక సామాజిక వర్గమైన పాటీదార్లకు చెందిన నేత భూపేంద్ర పటేల్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. అంతేకాదు.. ఈ సారి ఎన్నికల్లో 25శాతం మంది ఆ వర్గానికి చెందినవారే. హర్దిక్ పటేల్ రాక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్థించడం వంటివి సానుకూలాంశాలుగా మారాయి.
♦ గుజరాత్ అల్లర్లకు సంబంధించి 2002లో నమోదైన కేసులో ప్రధాని మోదీకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం కమలం పార్టీకి అదనపు బలాన్ని అందించింది. అప్పట్లో అల్లర్ల సమయంలో మోదీని బాధితుడిగా భాజపా ప్రచారం చేసుకొంది.
♦ ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయడం భాజపాకు బాగా కలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత అతితక్కువగా ఉన్న సమయంలో కొత్తపార్టీ కూడా బరిలోకి దిగడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ భారీగా చీల్చింది.
♦ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కురిపించిన ఉచిత హమీలను నమ్మశక్యం కాని తాయిలాలుగా ప్రచారం చేయడంలో కమలనాధులు విజయం సాధించారు. దీనికి తోడు గుజరాత్ ఆత్మగౌరవాన్ని తెరపైకి తీసుకొచ్చి భాజపా లబ్ధిపొందింది.
ఎన్నికల సైన్యం కూర్పు..
భాజపా గుజరాత్‌లో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. దీంతో కేంద్ర మంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్, గుజరాత్ నాయకులతో ఎన్నికల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, భూపేంద్ర యాదవ్, పురుషోత్తమ్ రూపాలా, పీయూష్ గోయల్, మన్‌సుఖ్ మాండవీయ, దర్శనా జర్దోష్ ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, పార్టీ నాయకులు అమిత్ ఠక్కర్, సీఆర్ పాటిల్, ప్రదీప్ సింగ్ వాఘేలా, రత్నాకర్, విజయ్ చౌత్వాలే, సిద్ధార్థ్ పటేల్, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి అతుల్ లిమాయ్ వంటి దాదాపు 150 మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. బయట ప్రాంతాల్లో స్థిరపడ్డ భాజపా నాయకులను కూడా సచేతనం చేసింది. ఉత్తర గుజరాత్‌లోని నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి అవసరమైన వ్యూహాత్మక బృందాలను అమిత్‌షా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాటీదార్ల ఓటర్లను మెప్పించే పనిని భూపేంద్ర పటేల్ స్వీకరించారు. అసంతృప్తితో పార్టీని వీడిన వారిని తిరిగి తెచ్చే బాధ్యతను హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తీసుకొన్నారు. ఆదివాసీ జాతులు ఎక్కువగా ఉన్న 14 జిల్లాల్లో ప్రచారాన్ని అమిత్ ఠక్కర్ అందుకున్నారు. ఇలా ఈ బృందం ఎటువంటి హడావుడి లేకుండా తమ పనులు చేసుకొంటూ పోయింది.
సుడిగాలి ప్రచారం..
ఈ ఎన్నికల్లో మోదీ సుడిగాలి పర్యటనలు అద్భుతంగా ప్రభావం చూపాయి. దీంతోపాటు 40 మంది స్టార్ ప్రచారకర్తల బృందాన్ని ఏర్పాటు చేసుకొంది. వాస్తవానికి ఈ ఏడాది మార్చి నుంచి మోదీ 20 రోజులు గుజరాత్‌లోనే గడిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ పర్యటనలు సాగాయి. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా 31 ర్యాలీలు 2 భారీ రోడ్‌షోలు నిర్వహించారు. అహ్మదాబాద్ రోడ్‌షోలో ఏకంగా మూడు గంటల్లో 50 కిలోమీటర్లు ప్రయాణించి 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం విశేషం. మరోవైపు పార్టీ అగ్రనేత అమిత్ షా సెప్టెంబర్ - అక్టోబర్ మధ్యనే 16 రోజులు గుజరాత్‌లో ఉన్నారంటే భాజపా వ్యూహ రచన ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 50కిపైగా ర్యాలీల్లో ఆయన ప్రచారం చేశారు.
దారీ తెన్ను లేని కాంగ్రెస్ వ్యూహం..
2017లో గుజరాత్‌లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత బలమైన ప్రతిపక్షంగా నిలవడంలో విఫలమైంది. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ గుజరాత్‌లో అడుగుపెట్టింది. సూరత్ నగరపాలికలో 27 స్థానాలను దక్కించుకొంది. మరో వైపు ప్రచార సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకే అధిక ప్రాధన్యమివ్వడం హస్తం పార్టీని దెబ్బకొట్టింది. రాహుల్ కేవలం గుజరాత్‌లో సూరత్, రాజ్‌కోట్‌లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ గతంలో అనుసరించిన ‘KHAM’ ( క్షత్రియ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం) వ్యూహం మరోసారి తెరమీదకు తెచ్చింది. ఇందులో భాగంగానే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఇంద్రవిజయ్ సిన్హ్ గోహిల్‌ను జులైలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. మొత్తం ఏడుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఎస్సీ వర్గానికి చెందిన జిగ్నేశ్ మేవానీ, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఖాదిర్ ఫిర్జాదాలకు కూడా స్థానం కల్పించింది. ఈ వ్యూహం పార్టీకి ఎలాంటి లాభం చేకూర్చలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. రంగంలోకి ‘అణు’ తూటాలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Gundu Sudarshan: ‘ఆవిడని కూర్చోపెట్టండి.. ఎంతసేపు నిలబెడతారు’ అని అరిచాడు...
-
World News
Pakistan: ఇమ్రాన్‌ను సాగనంపాలి.. లేకపోతే మేం పోవాలి: పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
General News
viveka murder case : వివేకా హత్య కేసు ఇంకా ఎంత కాలం విచారిస్తారు?: సీబీఐని ప్రశ్నించిన సుప్రీం
-
India News
Disqualification Petition: అనర్హతపై సుప్రీంకు లక్షద్వీప్ మాజీ ఎంపీ ఫైజల్.. రేపు విచారణ