Himachal polls 2022: సంప్రదాయం కొనసాగిస్తారో? చరిత్ర తిరగరాస్తారో?

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల(Himachal Pradesh polls 2022)కు వేళైంది. శనివారం 68 స్థానాలకు ఒకే విడతలో జరగనున్న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

Published : 12 Nov 2022 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల(Himachal Pradesh polls 2022)కు వేళైంది. శనివారం 68 స్థానాలకు ఒకే విడతలో జరగనున్న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలు ఆయా పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. 1982 నుంచి ఒక దఫా భాజపా, మరో దఫా కాంగ్రెస్‌కు అధికారం ఇస్తోన్న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలు ఈసారి అదే ఆనవాయితీని కొనసాగిస్తారా? లేదంటే అందుకు భిన్నంగా చరిత్రను తిరగరాస్తారా? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అధికార పార్టీలో పెన్షన్‌ గుబులు..

‘డబుల్ ఇంజిన్‌’ సర్కార్‌తోనే అభివృద్ధి అనే నినాదంతో కమలనాథులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్ర తిరగరాయాలన్న కసితో సర్వశక్తులూ ధారపోశారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ప్రముఖ నేతలంతా తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మళ్లీ అధికార పీఠం అప్పగిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడంతో పాటు 8లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్‌ సారథ్యంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్న ధీమాతో కమలనాథులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అధికార భాజపాలో గుబులు రేపుతున్నాయి. ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, మహిళలకు నెలకు రూ.1500 ఆర్థికసాయం, యువతకు లక్ష ఉద్యోగాలు తదితర హామీలతో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయింది. ఎప్పటిలాగే, ఈసారి కూడా ఐదేళ్ల తర్వాత ప్రజలు సంప్రదాయంగా తమను ఆదరిస్తారన్న విశ్వాసంతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. మరోవైపు, పంజాబ్‌లో గెలుపుతో మంచి ఉత్సాహంతో ఉన్న ఆప్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. దిల్లీ మోడల్‌ పాలనను చూపించి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుతోంది. పాత పింఛను విధానం పునరుద్ధరణ, ఉచిత విద్యుత్‌, నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామంటూ హామీలు ఇచ్చింది. 

కాంగ్రెస్‌కు పెను సవాలే..

ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్‌ వంటి అగ్రనేతలు ప్రచారం చేయగా.. కాంగ్రెస్‌ నుంచి ప్రియాంకా గాంధీ మాత్రమే ఎన్నికల ప్రచార ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభావం తగ్గిపోతున్న వేళ హిమాచల్‌ప్రదేశ్‌ను గెలుచుకోవడం ఆ పార్టీ మనుగడకు సంబంధించి ప్రతిష్టాత్మక అంశంగా మారింది. అయితే, రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఉండటం వల్ల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. అలాగే, కాంగ్రెస్‌కు 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లిఖార్జున ఖర్గేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపగలుగుతుందనే అంశంపైనా ఆసక్తి నెలకొంది. ఇంకోవైపు, గత రెండేళ్లలో కాంగ్రెస్‌ తొమ్మిది రాష్ట్రాల్లో పరాభవాలనే చవిచూస్తూ వస్తోంది. గతేడాది పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఆ పార్టీ పరాభవం ఎదుర్కోగా.. ఈ ఏడాది పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బలు తింది. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పాత పింఛను విధానం పునరుద్ధరణ వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తుతూ విజయంపై ఆశలుపెట్టుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో రాబోయే ఫలితం ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చనుంది. అలాగే, కమలనాథులు ఆశిస్తున్నట్టుగా ఈ ఎన్నికల్లోనూ మళ్లీ భాజపా విజయం సాధిస్తే ఆ పార్టీకి ఇది చారిత్ర విజయం కావడంతో పాటు శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే పలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకూ ఈ విజయం ఓ టానిక్‌లా ఉపయోగపడుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలు ప్రకటిస్తూ తీవ్రంగానే శ్రమించారు. ఈసారి హిమాచల్‌ప్రదేశ్‌లో నెలకొన్న త్రిముఖ పోరులో అక్కడి ప్రజలు గత సంప్రదాయాన్నే కొనసాగిస్తారో, చరిత్రను తిరగరాస్తారో చూడాలి.

55లక్షల మంది ఓటర్లు.. 412మంది అభ్యర్థులు..

హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 55,74,793 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 55,07,261మంది జనరల్‌ ఓటర్లు. 67,532మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఈసారి 43,173మంది యువత తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకోనుండటం విశేషం. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 1,21,409మంది 80 ఏళ్లకు పైబడిన వారు కాగా.. వీరిలో 1,136మంది శతాధిక వృద్ధులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌, మాజీ సీఎం వీరభద్రసింగ్‌ తనయుడు విక్రమాదిత్య సింగ్‌, భాజపా మాజీ చీఫ్‌ సత్పాల్‌ సింగ్‌ సట్టి తదితరులు ఉన్నారు. సీఎం జైరాంఠాకూర్‌ మండీలోని సెరాజ్‌ నుంచి బరిలో నిలుస్తుండగా.. భాజపా మాజీ చీఫ్‌ సట్టి ఉనా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 7881 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 789 పోలింగ్‌ బూత్‌లు సమస్యాత్మకమైనవిగా, 397 పోలింగ్‌ బూత్‌లో అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. శనివారం ఉదయం 8గంటలకు పోలింగ్‌ మొదలై సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. 2017 ఎన్నికల్లో 75.57శాతం పోలింగ్‌ నమోదైంది. లాహౌల్-స్పితి జిల్లాలోని స్పితి ప్రాంతంలోని తాషిగ్యాంగ్‌లో 15,256 అడుగుల ఎత్తులో ఈసీ బూత్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 

భారీగా నగదు, మద్యం సీజ్‌

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా ప్రలోభాల పర్వం కొనసాగినట్టు కనబడుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా నగదు, మద్యం సీజ్‌ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 2017 ఎన్నికల్లో కేవలం రూ.9.03 కోట్లు సీజ్‌ చేస్తే.. ఈసారి మాత్రం ఐదు రెట్లు అధికంగా అంటే దాదాపు రూ.50.28 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, డ్రగ్స్‌, ఆభరణాలను సీజ్‌ చేసినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో రూ.17.18 కోట్ల నగదు ఉండగా.. రూ.17.50 కోట్ల విలువ చేసే 9,72,818.24 లీటర్ల మద్యం, రూ.1.20 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.13.99 కోట్లు విలువ చేసే ఆభరణాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు