UP Election 2022: అఖిలేశ్‌కు పోటీగా కేంద్రమంత్రిని దించిన భాజపా

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్

Published : 01 Feb 2022 01:29 IST

లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections 2022) దగ్గరపడుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా సమాజ్‌వాదీ పార్టీ (SamajWadi Party) అధినేత అఖిలేశ్ యాదవ్‌ (Akhilesh Yadav), రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. దీంతో వీరి ప్రత్యర్థులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే అఖిలేశ్‌కు పోటీగా కేంద్రమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ను భాజపా (BJP) బరిలోకి దించింది. 

అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న అఖిలేశ్‌ యాదవ్‌.. తమ పార్టీకి, కుటుంబానికి మంచి పట్టున్న మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్‌ నియోజకవర్గాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి అఖిలేశ్ తండ్రి, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో కర్హాల్‌లో అఖిలేశ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర మంత్రి సత్యపాల్‌ సింగ్‌ బఘేల్‌ను భాజపా రంగంలోకి దించింది. ప్రస్తుతం ఈయన ఆగ్రా లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. దీంతో కర్హాల్‌ నియోజకవర్గ పోరు రసవత్తరంగా మారింది. 

అఖిలేశ్‌ నామినేషన్‌..

కర్హాల్‌ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్‌ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో యూపీ ప్రజలు చెడు రాజకీయాలకు ముగింపు పలుకుతారని ఆశిస్తున్నా. కేవలం కర్హాల్‌లోనే కాకుండా రాష్ట్రమంతటా ఎస్పీకి ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తా’’ అని హామీ ఇచ్చారు. అంతేగాక, కర్హాల్‌లో భాజపా ఎవర్ని నిలబెట్టినా కాషాయ పార్టీకి ఓటమి ఖాయమంటూ జోస్యం చెప్పారు. 

ములాయం సింగ్‌ స్వగ్రామమైన సైఫాయ్‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే కర్హాల్‌ నియోజకవర్గం ఉంటుంది. ఒక్క 2002లో మినహా 1993 నుంచి ఈ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. 2002లో అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోబరాన్‌ సింగ్‌ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎన్నికల తర్వాత సోబరాన్‌ తిరిగి ఎస్పీ గూటికి చేరి.. వరుసగా మూడు సార్లు జయకేతనం ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 3.7లక్షల ఓటర్లు ఉండగా.. ఇందులో 37శాతం యాదవులే. 

ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే యూపీ ఎన్నికలు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భాజపా, ఎస్పీ ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని