UP Polls: అభ్యర్థుల జాబితాపై పార్టీల కసరత్తు.. ఎన్నికల బరిలో యోగీ!

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడంపై దృష్టి సారించాయి.

Published : 14 Jan 2022 01:44 IST

172 మంది అభ్యర్థులతో భాజపా తొలిజాబితా సిద్ధం

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో 172 స్థానాలకు భాజపా అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ అగ్రనేతలు నేడు దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి మోదీ పాల్గొన్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలు హాజరయ్యారు. వీరు ముగ్గురూ కొవిడ్‌ బారిన పడడంతో వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరు కాగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఇద్దరు రాష్ట్ర డిప్యూటీ సీఎంలతోపాటు పలువురు నేతలు నేరుగా పాల్గొని అభ్యర్థుల జాబితాపై చర్చించారు. త్వరలోనే ఈ జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బరిలో అగ్రనేతలు.. 

ఇదివరకు ఐదుసార్లు గోరఖ్‌పూర్‌ ఎంపీగా గెలుపొందిన యోగీ ఆదిత్యనాథ్‌ ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా సీఎం పదవి చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధం కాగా.. ఆయోధ్య నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న దినేశ్‌ శర్మా లఖ్‌నవూలోని ఏదైనా స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. మరో డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య మాత్రం సిరాథు నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ని కూడా బరిలో దింపేందుకు పార్టీ సిద్ధమైంది. 172 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారుపై సంప్రదింపులు జరిపామన్న డిప్యూటి సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య.. గత ఎన్నికల్లో కంటే అధిక మెజారిటీ సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితాను ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ విడుదల చేశారు. అందులో 50 మంది మహిళా అభ్యర్థులు ఉండగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధితురాలి తల్లి ఆశా సింగ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే గౌరవ వేతనం పెంపు కోసం చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించిన ఆశావర్కర్ పూనమ్ పాండేను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. పూనమ్.. షాజహాన్‌ పూర్ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ జాబితాలో 40 శాతం మంది మహిళలు, 40 శాతం మంది యువతకు చోటు కల్పించినట్లు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

ఇతర పార్టీల కసరత్తు..

అభ్యర్థుల జాబితా విడుదలలో కాంగ్రెస్‌ ముందుండగా.. భాజపా ఇప్పటికే జాబితా సిద్ధం చేసినట్లు తెలిపింది. మరోవైపు 300 మంది అభ్యర్థులతో తుది జాబితాను సిద్ధం చేశామని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రకటించింది. అందులో 90 స్థానాల్లో దళితులు పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఇక ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మాత్రం అభ్యర్థుల జాబితాపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, భాజపా నుంచి ఆ పార్టీలోకి వలసలు మొదలు కావడంతో అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గడిచిన 3రోజుల్లోనే 8 మంది భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సమాజ్‌వాదీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఎన్నికలకు ముందు వలసలు పుంజుకున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులు, ప్రచారంపై దృష్టి సారించాయి. ఇక మొత్తం 403 శాసనసభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు