Gujarat Election: ఓటింగ్‌కు ముందు గుజరాత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై దాడి..!

గుజరాత్‌లో ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అదృశ్యం కావడం కలకలం రేపింది.

Updated : 05 Dec 2022 10:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌లోని దంతా నియోజకవర్గంలో ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు ఉద్రిక్తత చోటు చేసుకొంది. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాంతీ ఖరాడీ ఆచూకీ తెలియడంలేదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తర్వాత ఆయన సురక్షితంగానే ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంతీ మీడియాతో మాట్లాడుతూ భాజపా గూండాలు తనను వెంటాడారని ఆరోపించారు. ‘‘దురదృష్టకర ఘటన చోటు చేసుకొంది. నేను నా ఓటర్లను కలిసేందుకు వెళ్లాను. కానీ, అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా ఉండటంతో తప్పించుకొన్నాను.  మాపై దాడి చేసిన వారిలో భాజపా అభ్యర్థి లధు పరిగి ఉన్నారు. అతడితోపాటు ఎల్‌కె బరాడ్‌, అతడి సోదరుడు వందన్‌జీ ఉన్నారు. వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. కత్తులతో నాపై దాడి చేశారు.  వెంటనే మేము అక్కడి నుంచి మా వాహనం వెనక్కి తిప్పాం. కొన్ని కార్లలో మా వెంటపడ్డారు. మేము 10-15 కిలోమీటర్లు పారిపోయాం. అక్కడ అడవుల్లో రెండు గంటలపాటు తలదాచుకొన్నాం’’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్‌ చేసిన కొన్ని గంటల్లోనే కాంతీ ప్రకటన వెలువడింది. బనస్కాంత జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జిగ్నేష్‌ మేవానీ దీనిపై స్పందించారు. కాంతీభాయ్‌ను హత్యచేయడానికి భాజపా అభ్యర్థి యత్నించారని ఆరోపించారు. 

మరోవైపు నాలుగు రోజుల క్రితం కాంతీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు కాంతీ స్పందిస్తూ ‘‘అప్పుడు ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకొని ఉంటే ఈ దాడి జరిగేది కాదు’’ అని పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని