Piyush Jain: పీయూష్‌ జైన్‌ మా వాడు కాదు.. మీవాడే: అఖిలేశ్‌ కౌంటర్‌

‘నల్లధన కుబేరుడు’ పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేత వ్యవహారం దేశంలోనే కాదు ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పీయూష్‌ జైన్‌తో సమాజ్‌వాదీ పార్టీకి ......

Published : 29 Dec 2021 01:42 IST

భాజపా సొంత వ్యాపారి ఇంట్లో పొరపాటున దాడి చేయించిందన్న మాజీ సీఎం

ఉన్నావ్‌: ‘నల్లధన కుబేరుడు’ పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేత వ్యవహారం దేశంలోనే కాదు ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పీయూష్‌ జైన్‌తో సమాజ్‌వాదీ పార్టీకి సంబంధాలు ఉన్నాయంటూ భాజపా నేతల ఆరోపణల్ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఖండించారు. అతడితో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలూ లేవని స్పష్టంచేశారు. ఉన్నావ్‌లో మంగళవారం సమాజ్‌వాదీ రథయాత్ర ప్రారంభానికి ముందు అఖిలేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. భాజపా సొంత వ్యాపారి అయిన పీయూష్‌ జైన్‌పై పొరపాటున దాడి చేయించిందన్నారు. అతడి కాల్‌ డేటాని చూస్తే పీయూష్‌ జైన్‌తో టచ్‌లో ఉన్న భాజపా నేతల పేర్లు బయటపడతాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పుష్పరాజ్‌ జైన్‌ బదులుగా డిజిటల్‌ మిస్టేక్‌ వల్ల పీయూష్‌ జైన్‌ ఇంట్లో దాడులు జరిగాయని తెలిపారు. టీవీ ఛానళ్లలో కూడా మొదట్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వ్యక్తి ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టు స్క్రోలింగ్‌ వచ్చిందనీ.. ఆ తర్వాత మధ్యాహ్నానికి అది నిజం కాదని తెలిసి ప్రసారం చేయడం నిలిపివేశారని చెప్పారు. కాన్పూర్‌కు చెందిన వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరకడం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వైఫల్యాన్ని రుజువు చేస్తున్నాయని అఖిలేశ్‌ మండిపడ్డారు.

ఇటీవల ఐటీ శాఖతో పాటు సీబీఐటీ, కస్టమ్స్‌ అధికారులు కాన్పూర్‌కు చెందిన అత్తరు వ్యాపారి పీయూష్‌ జైన్‌ ఇంటిపై జరిపిన దాడుల్లో రూ.257 కోట్ల డబ్బుతో పాటు 25కిలోల బంగారం, 250కిలోల వెండిని స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాన్పూర్‌లోని అతడి ఇంటితో పాటు కన్నౌజ్‌లోని ఫ్యాక్టరీలోనూ సోదాలు జరిపి ఈ మొత్తాన్ని సీజ్‌ చేసి పీయూష్‌ జైన్‌ని అరెస్టు చేశారు. కాన్పూర్‌ కోర్టు పీయూష్‌ జైన్‌కి 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించింది.  త్వరలో యూపీలో ఎన్నికలు జరగనున్న వేళ పీయూష్‌ జైన్‌ అరెస్టు వ్యవహారంలో భాజపా సమాజ్‌వాదీ పార్టీపై మాటల దాడికి దిగింది. అత్తరు వర్తకుడితో అఖిలేశ్‌ పార్టీకి సంబంధం ఉందంటూ ఆరోపిస్తోంది. అయితే, పీయూష్‌ జైన్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సమాజ్‌వాదీ పార్టీ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని