Chirag Paswan: మరో ‘శిందే’ కోసం భాజపా, జేడీయూల వెతుకులాట..!

బిహార్‌లో ప్రత్యర్థులకు ప్రయోజనం కలిగించేలా భాజపా, జేడీ(యూ) పార్టీలు ‘శిందే’ వంటి నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని లోక్‌జనశక్తి పార్టీ (LJP) మాజీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ ఆరోపించారు.

Updated : 04 Jul 2022 14:55 IST

బిహార్‌లో ఎన్‌డీఏ మిత్రపక్షాలపై చిరాగ్‌ పాసవాన్‌ ఆరోపణలు

పట్నా: శివసేనకు చెందిన ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) నేతృత్వంలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బిహార్‌లో ప్రత్యర్థులకు ప్రయోజనం కలిగించేలా భాజపా, జేడీ(యూ) పార్టీలు ‘శిందే’ వంటి నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని లోక్‌జనశక్తి పార్టీ (LJP) మాజీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ (Chirag Paswan) ఆరోపించారు. కేవలం అధికారం కోసమే రెండు పార్టీలు కూటమిలో కొనసాగుతున్నాయన్న ఆయన.. తమ కాళ్లకింద దుప్పటిని లాక్కునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో భాజపా సంఖ్యను తగ్గించేందుకే ముఖ్యమంత్రి నీతీశ్‌ ప్రయత్నిస్తున్నారని చిరాగ్‌ పాసవాన్‌ ఆరోపించారు.

‘బిహార్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ (AIMIM) ఎమ్మెల్యేలు గెలిచినప్పటి నుంచి వారు జేడీయూతో టచ్‌లో ఉన్న విషయం అందరికీ తెలుసు. బిహార్‌లో ఆ పార్టీకి ఉన్న తక్కువ ఆదరణ దృష్ట్యా అందులో భవిష్యత్తు లేదని వారికి అర్థమయ్యింది. ఈ క్రమంలో సీఎం పార్టీలో కాకుండా ఆర్‌జేడీలో చేరిపోయారు. ఇలా భాజపా కంటే ఆర్‌జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించడం వెనుక సీఎం నీతీశ్‌ కుమార్‌ హస్తం ఉంది’ అని ఎల్‌జేపీ (రాంవిలాస్‌) నేత చిరాగ్‌ పాసవాన్‌ ఆరోపించారు. కూటమిని విచ్ఛిన్నం చేసుకునేందుకే ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.. ఇందుకు ‘శిందే’ వంటి రెబల్‌ నేత కోసం ఎదురుచూస్తున్నాయని ఆరోపించారు.

ఇదిలాఉంటే, 2020 ఎన్నికల వరకు ఎన్‌డీఏ కూటమిలోనే కొనసాగిన ఎల్‌జేపీ.. నీతీశ్‌ కుమార్‌ తీరును వ్యతిరేకిస్తూ బయటకు వచ్చింది. అయితే, ఎల్‌జేపీ (రాంవిలాస్‌) పేరుతో సొంతగూటిని ఏర్పరచుకున్న చిరాగ్‌ పాసవాన్‌.. మళ్లీ భాజపాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయానికి ఎన్‌డీఏ కూటమిలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మజ్లిస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇటీవల అధికార కూటమిలో కాకుండా ఆర్‌జేడీలో చేరడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన ఆయన.. ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వ్యవహారం వల్లే వారు ప్రతిపక్షపార్టీలో చేరారని అన్నారు. భాజపా ప్రాబల్యాన్ని తగ్గించేందుకే నీతీశ్‌ ప్రయత్నిస్తున్నారని చిరాగ్‌ పాసవాన్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని