Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్‌ను కలిసిన ఫడణవీస్‌

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. గువాహటిలోని స్టార్‌ హోటల్‌లో ఉన్న తమ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలను ముంబయికి రప్పించేందుకు శివసేన తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు భాజపా చకచకా పావులు కదుపుతోంది.

Updated : 29 Jun 2022 00:07 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. గువాహటిలోని స్టార్‌ హోటల్‌లో ఉన్న తమ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలను ముంబయికి రప్పించేందుకు శివసేన తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు భాజపా చకచకా పావులు కదుపుతోంది. తాజాగా భాజపా కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, అసెంబ్లీలో బలనిరూపణకు ఆదేశించాలని కోరుతూ ఫడణవీస్‌ గవర్నర్‌ను కలిసి లేఖ అందించారు. అంతకుముందు దిల్లీ పర్యటనకు వెళ్లిన దేవేంద్ర ఫడణవీస్‌ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వరుస భేటీలు నిర్వహించారు. ఆ తర్వాత ముంబయికి చేరుకోగానే.. విమానాశ్రయం నుంచి నేరుగా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌-ఎన్సీపీతో పొత్తుపెట్టుకోవడం ఇష్టం లేదని పదేపదే చెబుతున్నారని, అందువల్ల వారు ప్రభుత్వంలో లేరని అర్థమవుతోందని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్లు ఫడణవీస్‌ తెలిపారు. ఫడణవీస్‌ వెంట భాజపా నేతలు గిరీశ్‌ మహాజన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ ఉన్నారు. అయితే ఈవిషయంపై గవర్నర్‌ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు జూన్‌ 30న బలనిరూపణ చేయాలని మహారాష్ట్ర గవర్నర్‌ ఆదేశించారన్న వార్తలను రాజ్‌భవన్‌ ఖండించింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కావని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని