పీకేతో కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాకే పట్టం కడతారు: డీకే అరుణ

తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రాలేదని.. రైతు ఆత్మహత్యలు ఆగలేదంటూ అమరవీరుల ఆత్మలు కన్నీరు పెట్టుకుంటున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.

Updated : 27 Apr 2022 17:15 IST

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రాలేదని.. రైతు ఆత్మహత్యలు ఆగలేదంటూ అమరవీరుల ఆత్మలు కన్నీరు పెట్టుకుంటున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అరుణ మాట్లాడారు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసం పోయిందని డీకే అరుణ అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమలు కూడా ఆ పార్టీకి తొలగిపోయాయని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. ప్రధాని మోదీ, భాజపాపై పదేపదే విమర్శలు చేస్తూ జాతీయ నాయకుడిని అవుతాననే భ్రమల్లో కేసీఆర్ ఉన్నారన్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని.. 8 ఏళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ ఎంతవరకు నెరవేర్చారని డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పూర్తిగా వంచించి జాతీయ రాజకీయాల గురించి సీఎం మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.

భారత రాష్ట్రీయ సమితిని ఎవరూ కోరుకోవడం లేదు

‘‘దళితబంధును తెలంగాణలో అమలు చేయకముందే దేశం మొత్తం అమలు చేయాలని ప్లీనరీలో తీర్మానం చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఉద్యోగ ప్రకటనలను నిరుద్యోగులు నమ్మడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్లగానే చూస్తున్నారు. గ్రామాల్లో వైకుంఠదామాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు కేంద్రం నిధులతో చేసినవి కావా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో కేసీఆర్‌ చెప్పాలి. వరిధాన్యం కొనుగోలుకు కేంద్రమే డబ్బు ఇస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తే. ప్రధాని మోదీకి అంహకారం ఉంటే కేసీఆర్‌ ఇన్నిసార్లు ఆయన్ను కలిసేవారా? భారత రాష్ట్రీయ సమితిని కేసీఆర్‌ కుటుంబం తప్ప ప్రజలెవరూ కోరుకోవడం లేదు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కాదు.. గ్రోత్‌ ఇంజిన్‌ సర్కారు కావాలంటున్న కేసీఆర్‌.. రాష్ట్రంలో గ్రోత్‌ ఎక్కడుందో చెప్పాలి. తెరాస నేతలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి భాజపాను మతతత్వ పార్టీ అని విమర్శిస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి కాంగ్రెస్‌, తెరాస ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు భాజపాకే పట్టం కడతారు’’ అని డీకే అరుణ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని