Eatala: ధర్నాచౌక్‌ని ఎత్తేసిన కేసీఆర్‌కు సీపీఐ మద్దతా?.. సిగ్గుచేటు: ఈటల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అంటకాగేవారిని, పొత్తు పొట్టుకొనే వారిని తెలంగాణ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరని భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల...

Published : 22 Aug 2022 01:53 IST

మునుగోడు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అంటకాగేవారిని, పొత్తు పొట్టుకొనే వారిని తెలంగాణ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరని భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. మునుగోడులో భాజపా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు వామపక్షాల మద్దతు సిగ్గుచేటని.. ధర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్‌కు లెఫ్ట్‌ మద్దతా? అని ప్రశ్నించారు. తెరాసతో పొత్తు ప్రకటించిన సీపీఐ నేతల వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘సీపీఐ, సీపీఎం నేతల్లారా.. ఎనిమిదేళ్లుగా మీరు ఏనాడైనా ప్రగతిభవన్‌లో అడుగు పెట్టారా? మీ కార్మిక సంఘాలు సమ్మెలు చేసిన సందర్భంగా మిమ్మల్ని చర్చలకు పిలిచి సీఎం సమస్యలను పరిష్కరించారా? కమ్యూనిస్టు పార్టీలకు, ట్రేడ్‌ యూనియన్లకు అడ్డా ఇందిరాపార్కు. అలాంటి చోట ధర్నాలు చేసే అధికారం లేదని చెప్పి.. చైతన్యం ఉండకూడదని, ట్రేడ్‌ యూనియన్లు ఉండకూడదని చెప్పి నిషేధించిన కేసీఆర్‌.. ఈరోజు మీకు ప్రగతికాముకుడిగా కనబడుతున్నారా? సీఎం తమ సమస్యల్ని పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేరని కేసీఆర్‌ అన్నారు. దీంతో అనేకమంది డ్రైవర్లు, కండక్టర్ల ఆత్మహత్యలకు కారణమై.. చివరికి ట్రేడ్‌ యూనియన్లు పెట్టుకోం అంటూ మోకాళ్లపై దండంపెట్టి వేడుకున్న చరిత్రను మరిచిపోయారా కమ్యూనిస్టు నేతల్లారా? మున్సిపల్‌ కార్మికులు సమ్మెచేసినప్పుడు  1700 మందిని ఒక్క కలంపోటుతో తీసేసిన రోజు వారి పక్షాన నేను నిలబడ్డా. తెలంగాణ వచ్చాక మీ పేపర్‌లో ప్రజల పక్షాన వార్తలు రాస్తే దాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుని మీ కళ్లల్లో మట్టికొట్టిన కేసీఆర్‌.. మీకు ప్రగతిసారథిగా కనబడుతున్నారా? ఇలా ఒకటికాదు, రెండు కాదు.. వందల సమస్యలపై మీరు సమ్మెలు చేస్తే కనీసం  మిమ్మల్ని ప్రగతిభవన్‌కు పిలిచి అడిగిన పాపాన పోని కేసీఆర్‌ మీకు మంచివాడిలా కనబడుతున్నారా? పోడు రైతులకు పట్టాలిచ్చే దమ్ము మీకు ఉందా?’’ అని ప్రశ్నించారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ విద్యా వాలంటీర్లను ఇప్పటివరకు రెన్యువల్‌ చేయలేదని మండిపడ్డారు. వేలాది మంది వీఆర్వోలను తొలగించి వారి పొట్టకొట్టారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు రుణాలు దొరకడంలేదు. పోడుభూముల సమస్యలు అలాగే ఉన్నాయి. భాజపా వస్తే మీటర్లు వస్తాయని ఎన్ని ఫ్లెక్సీలు కట్టినా.. హోర్డింగ్‌లు పెట్టినా.. స్తంబాలపై స్టిక్కర్లు అతికించినా ప్రజలు తగిన గుణపాఠం చెబుతూనే ఉన్నా పాడిన పాటే పాడుతున్నారన్నారు. హుజూరాబాద్‌లో ఏం జరిగిందో మునుగోడులోనూ అదేజరుగుతుందన్నారు. నల్గొండ జిల్లా చైతన్యానికి మారుపేరు, అన్యాయానికి, అక్రమాలకు, దుర్మార్గానికి వ్యతిరేకంగా పరుగెత్తి కొట్లాడే జిల్లా అన్నారు.  తెలంగాణలో తెరాస పాలన పోవాలని ప్రజలు తపనపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకే భాజపాలో చేరుతున్నారన్నారు. ఆయన్ను నిండుమనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని