ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ కంటే కేసీఆరే భయపడుతున్నారు: లక్ష్మణ్‌

అసెంబ్లీ సమావేశాలు తెరాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ సమావేశాలుగా జరిగాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకే

Updated : 16 Mar 2022 15:49 IST

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాలు తెరాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ సమావేశాలుగా జరిగాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీని వేదికగా చేసుకున్నారని ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు.

‘‘ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం మాట్లాడుతూ కేంద్రాన్ని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్‌ కంటే కేసీఆరే ఎక్కువ భయపడుతున్నారు. డబుల్‌ ఇంజిన్‌కే ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద పీట వేశారు. కాంగ్రెస్‌, తెరాస ఒకే గూటి పక్షులనే విషయం అసెంబ్లీ సమావేశాల ద్వారా తేటతెల్లమైంది. కేసీఆర్‌ భాజపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేయించి వాళ్ల గురించే మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్లు అసెంబ్లీలో మాట్లాడి సభను దుర్వినియోగం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా భాజపాపై విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హిజాబ్‌ అంశంపై కేసీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. తన పతనాన్ని గమనించే మోదీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో కరెంట్‌, నీళ్లు కట్‌ చేస్తామని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. సింగిల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్ల ఒక్క కుటుంబానికే మేలు జరుగుతోంది. తెలంగాణ ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. యువత తిరగబడుతుందనే ఉద్యోగాలపై ప్రకటన చేశారు. కేసీఆర్‌ తెలంగాణకు ముఖ్యమంత్రా?గజ్వేల్‌కా? అనేది స్పష్టం చేయాలి. కాంగ్రెస్‌ పార్టీని తెరాస పూర్తిగా కబ్జా చేసింది. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతుంది’’ అని లక్ష్మణ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని