Aryan khan: ఆర్యన్‌ కేసులో మరో ట్విస్ట్‌.. భాజపా నేత సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ ముంబయి జోన్‌ అధికారి సమీర్‌ వాంఖడేను తప్పించడం..  ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం ఐదు......

Updated : 24 Sep 2022 15:39 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ ముంబయి జోన్‌ అధికారి సమీర్‌ వాంఖడేను తప్పించడం..  ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం ఐదు కేసులను ఎన్‌సీబీ అధికారి సంజయ్‌ కుమార్‌ సింగ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజపా నేత మోహిత్‌ కంబోజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు మంత్రులు షారుక్‌ ఖాన్‌ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ కేసులో ఎన్‌సీపీకి సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్‌ డ్రగ్స్‌ కేసు ఎపిసోడ్‌లో ఎన్సీపీ నేత సునీల్ పాటిల్‌ ఓ కీలక సూత్రధారి అని ఆరోపించారు. అతడికి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు అనేకమంది నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ కఠిన లాక్‌డౌన్‌ సమయంలోనూ డ్రగ్‌ వ్యాపారి, అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడైన చింకూ పఠాన్‌ను సహ్యాద్రి రాష్ట్ర అతిథిగృహంలో కలిశారని ఆరోపించారు. 

డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ సాక్షిగా ఉన్న కిరణ్‌ గోసావి సునీల్ పాటిల్‌కు సహచరుడేనని ఆరోపించారు. క్రూజ్‌ నౌకలో ఎన్‌సీబీ అధికారులు దాడులు చేయడానికి ముందు అక్టోబర్‌ 1 వరకు శామ్‌ డిసౌజా, గోసావిలతో సునీల్‌ పాటిల్‌ టచ్‌లోనే ఉన్నాడని ఆరోపించారు. క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు కుట్రలో సూత్రధారి సునీల్‌ పాటిలేనని, అతడు అనిల్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడికి మంచి స్నేహితుడని ఆరోపించారు. 1999 నుంచి 2014 వరకు అలాగే, 2019 నుంచి మహావికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా సునీల్ పాటిల్‌ ఉద్యోగుల బదిలీలు/పోస్టింగ్‌ రాకెట్లలో జోక్యం ఉందని ఆరోపించారు. సహ్యాద్రి అతిథిగృహంలో దావూద్‌ అనుచరుడితో అనిల్‌ దేశ్‌ముఖ్‌ రహస్యంగా కలిసిన ఫొటోలను చూపించారు. సునీల్ పాటిల్‌, డ్రగ్ వ్యాపారులతో సంబంధాలను ఎన్‌సీబీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాటిల్‌తో లలిత్‌ హోటల్‌ వద్ద నవాబ్‌ మాలిక్‌ ఏం చేశారో చెప్పాలన్నారు. ఈ మీడియా సమావేశం తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని కంబోజ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 

అయితే, మోహిత్‌ కంబోజ్‌ చేసిన ఆరోపణలను ఎన్సీపీ అధికార ప్రతినిధి, మంత్రి నవాబ్‌ మాలిక్‌ కొట్టిపారేశారు. సమీర్‌ వాంఖడే ప్రైవేటు సైన్యం వాస్తవాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలో విఫలమైందన్నారు. రేపు అన్ని వాస్తవాలను వెల్లడిస్తానంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని