BJP: కాంగ్రెస్‌కి భారాస బీ టీమ్‌.. ఆ రెండు పార్టీలు కలుస్తాయి: తరుణ్‌చుగ్‌

‘‘కాంగ్రెస్‌కి భారాస బీ టీమ్‌. ఆరెండు పార్టీలు కలుస్తాయి.  కలిస్తే పార్టీ వీడుతానన్న రేవంత్‌రెడ్డి  కాంగ్రెస్‌ను వీడే సమయం దగ్గరలోనే ఉంది’’ అని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి  తరుణ్‌ చుగ్‌ అన్నారు.

Updated : 19 Apr 2023 21:06 IST

హైదరాబాద్‌: కేసీఆర్‌ సర్కారును మార్చాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కేసీఆర్‌ తెలంగాణ నయా నిజాం.. ఆయనకు అహంకారం ఎక్కువ. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏమీ పట్టవు. ఆయన కుటుంబం వీటన్నింటికీ అతీతం అని అనుకుంటారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భాజపా ఆందోళన కొనసాగుతుంది. ఇది తెలంగాణ భవిష్యత్‌ కోసం చేసే పోరాటం.

విపక్షాల కూటమి కోసం కేసీఆర్‌  ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. తన రిటైర్‌మెంట్‌ కేసీఆర్‌కి తెలుసు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రిటైర్‌ కాబోతున్నారు. కేంద్రంలో బలహీన సర్కారు రావాలనుకుంటున్నారు. దిల్లీలో చేతులు కలుపుతారు.. ఇక్కడ పోరాటం చేస్తారు.. వారి విధానమేంటో రేవంత్‌రెడ్డి చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారు? కాంగ్రెస్‌కి భారాస బీ టీమ్‌. ఆ రెండు పార్టీలు కలుస్తాయి. భారాస, కాంగ్రెస్‌ కలిస్తే పార్టీ వీడుతానని రేవంత్‌రెడ్డి చెప్పారు. రేవంత్‌ పార్టీని వీడే సమయం దగ్గరలోనే ఉంది’’ అని తరుణ్‌ చుగ్‌ అన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ పేరుతో ఇంటింటికీ నీళ్లు ఇస్తామని రూ.40వేల కోట్లు ఖర్చు చేశారని.. అయినా, ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.  ‘‘నీళ్లు ఇవ్వకపోతే  ఓటు అడగనన్నారు. మరి ఇంటింటికీ నీళ్లు ఇచ్చారా? జల్‌జీవన్‌ మిషన్‌ కింద అన్ని రాష్ట్రాల్లో ఇంటింటికీ కేంద్రం నీళ్లు ఇచ్చింది. ఈనెల 23న పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో పాల్గొనేందుకు అమిత్‌ షా చేవెళ్ల వస్తున్నారు’’ అని బండి సంజయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని