BJP: భాజపా పునర్వ్యవస్థీకరణ!

దేశవ్యాప్తంగా భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణను భాజపా త్వరలో చేపట్టనుంది. దీంతోపాటు భారీ ఎత్తున సభ్యత్వ నమోదును ప్రారంభించనుంది.

Published : 12 Jun 2024 05:02 IST

దేశవ్యాప్తంగా కార్యవర్గంలో మార్పులు
కొత్త అధ్యక్షుడి ఎన్నికకు అవకాశం
భారీగా సభ్యత్వ నమోదుకు సిద్ధం

దిల్లీ: దేశవ్యాప్తంగా భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణను భాజపా త్వరలో చేపట్టనుంది. దీంతోపాటు భారీ ఎత్తున సభ్యత్వ నమోదును ప్రారంభించనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కార్యవర్గాలతోపాటు పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. 

ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తోంది. అయితే అత్యవసర సమయాల్లో అధ్యక్షుడి పదవీకాలాన్ని పొడిగించేందుకు పార్టీ పార్లమెంటరీ బోర్డుకు అధికారం ఇస్తూ ఇటీవల నియమావళిని సవరించారు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ నడ్డాకు పొడిగింపు ఇచ్చే అవకాశముంది. 

ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా వైద్య, ఆరోగ్యం, రసాయనాలు-ఎరువుల శాఖల మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో చేరారు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2019లో భాజపా అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షా అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో చేరారు. దీంతో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డాను పార్టీ నియమించింది. ఆ తర్వాత 2020 జనవరిలో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 

గతంలో మాదిరిగానే ఈసారీ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించే అవకాశం లేకపోలేదు. అయితే పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలకు ఎన్నికలతోపాటు సభ్యత్వ నమోదును భారీగా చేపట్టనున్న నేపథ్యంలో అధ్యక్షుడి నియామకం అవసరం ఎంతో ఉంది. 2019లో నడ్డాను ప్రభుత్వంలో చేర్చుకోకుండా పార్టీ అధ్యక్షుడిగా నియమించడంద్వారా సమర్థ నేతకు బాధ్యతలను ప్రధాని మోదీ అప్పగించినట్లయింది. ఈసారీ అలాగే సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలకు అవకాశం దక్కుతుందా అనేది కొంత అనుమానంగా ఉంది. ఎందుకంటే సీనియర్‌ నేతలంతా ప్రభుత్వంలోనే చేరారు. సమర్థ నేతలుగా పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్‌లలో ఒకరు పార్టీ అధ్యక్షులవుతారని అనుకున్నారు. కానీ వారిద్దరినీ కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకోవడంతో ఆ అవకాశం లేదు. దీంతో ఇక రాష్ట్రాల అధ్యక్షుల్లో ఒకరినిగానీ, జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరినిగానీ ఎన్నుకునే అవకాశముంది. 

  • భాజపా రాష్ట్ర అధ్యక్షుల్లో కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరడంతోపాటు ఉత్తర్‌ ప్రదేశ్‌లో దెబ్బతిన్న నేపథ్యంలో కొత్త ముఖాలను జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నియమించే అవకాశముంది.
  • రాజస్థాన్‌ పార్టీ అధ్యక్షుడు సీపీ జోషిని సామాజిక సమీకరణాల్లో భాగంగా మార్చే అవకాశముంది. 
  • పశ్చిమ బెంగాల్‌ పార్టీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ కేంద్ర ప్రభుత్వంలో చేరారు. బిహార్‌ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హరియాణా పార్టీ అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంది. 
  • ఉత్తర్‌ ప్రదేశ్‌లో పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడంతో పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్‌ చౌధరిని మార్చే అవకాశముంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని