Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్‌ బాపట్‌ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం

Girish Bapat: భాజపా లోక్‌సభ ఎంపీ గిరీశ్ బాపట్‌ ఇకలేరు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలోచికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

Published : 29 Mar 2023 15:45 IST

పుణె: భాజపా(BJP) సీనియర్‌ నేత, పుణె ఎంపీ గిరీశ్‌బాపట్‌(Girish Bapat) (73) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. బాపట్‌ కస్బాపేట్‌ నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే, 2019లో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ సేవలందించారు. 

‘‘ఈ రోజు చాలా విషాదకరమైన దినం. భాజపా సీనియర్‌ నేత, పుణె లోక్‌సభ సభ్యుడు గిరిశ్‌ బాపట్‌ మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆస్పత్రిలోనే కన్నుమూశారు. గత ఏడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మృతిచెందారు’’ అని భాజపా పుణె నగర అధ్యక్షుడు జగదీశ్‌ ములిక్‌ ట్విటర్‌లో వెల్లడించారు. మరోవైపు, గిరీశ్‌ బాపట్‌ మరణం పట్ల మహారాష్ట్ర భాజపా సంతాపం తెలిపింది. ఈ విషాదకర సమయంలో పార్టీ మొత్తం ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని పేర్కొంది. 

గిరీశ్‌ బాపట్‌ మృతిపై ప్రధాని మోదీ విచారం

గిరీశ్ బాపట్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఆయన నిరాడంబరుడని.. కష్టపడి పనిచేసే స్వభావం కలిగగిన నేత అని కొనియాడారు. సమాజానికి ఎంతో శ్రద్ధతో పనిచేశారన్నారు. మహారాష్ట్ర అభ్యున్నతి కోసం విస్తృతంగా పనిచేశారని.. మరీ ముఖ్యంగా పుణె అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో కృషిచేసిన అలాంటి నేత మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహారాష్ట్రలో భాజపా నిర్మాణం, బలోపేతంలో కీలక పాత్ర పోషించారన్నారు.

మరణవార్త బాధించింది.. సీఎం శిందే

పుణె ఎంపీ గిరీశ్‌ బాపట్‌ మరణంపై సీఎం ఏక్‌నాథ్ శిందే సంతాపం ప్రకటించారు. ఆయన మరణవార్త బాధించిందంటూ ట్వీట్‌ చేశారు. కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా, కేబినెట్‌మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితానుభవం కలిగిన ప్రజాభిమానం ఉన్న నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని