Published : 04 May 2022 21:09 IST

BJP: మే 20 నుంచి జైపూర్‌లో భాజపా సమావేశాలు.. వాటిపైనే కీలక చర్చ!

దిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాజస్థాన్‌ కీలక రాజకీయ వ్యూహాల రూపకల్పనకు వేదిక కాబోతోంది. కాంగ్రెస్‌, భాజపా ఇక్కడ వరుస సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ‘నవ సంకల్ప్‌ చింతన్‌ శివిర్‌’ జరగనుండగా.. తాజాగా భాజపా కూడా జైపూర్‌లో మే 20, 21 తేదీల్లో ఆఫీస్‌ బేరర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దీంతో రాజస్థాన్‌లో రాజకీయ సందడి మొదలుకానుంది. రెండు రోజుల పాటు జరగనున్న భాజపా ఆఫీస్‌ బేరర్ల సమావేశాల్లో పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ ఒక సెషన్‌లో వర్చువల్‌గా ప్రసంగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశాలకు భాజపా జాతీయ ఆఫీస్‌ బేరర్లతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కీలక నేతలు హాజరుకానున్నారు.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో ఈ సమావేశాలు నిర్వహించాలన్న భాజపా నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ రాజస్థాన్‌ని జోధ్‌పూర్‌లో ఇటీవల చెలరేగిన మత ఘర్షణలు సహా పలు అంశాలపై కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని కాషాయ దళం ప్రయత్నిస్తోంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న వేళ ఈ పరిణామాలు కీలకంగా మారాయి. మరోవైపు, భాజపా రాష్ట్ర శాఖలు ఈ సమావేశాల్లో తమ సంస్థాగత పనులపై నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts