Politics: భాజపాకు ఓటమి తప్పదు: అఖిలేశ్‌ యాదవ్‌

ఏళ్ల పాటు పాలన చేస్తామని చెప్పుకుంటోన్న భాజపా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 పార్లమెంటు స్థానాల్లోను ఓటమి చెందుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. 

Published : 22 Jan 2023 15:04 IST

లఖ్‌నవూ: వచ్చే ఏడాది (2024) జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టిపెట్టిన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భాజపాను ఓడించేందుకు ప్రయత్నిస్తోన్న విపక్ష పార్టీలు.. ఆ పార్టీ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 పార్లమెంట్‌ స్థానాల్లో భాజపా ఓటమి చవిచూడవచ్చని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

‘దశాబ్దాల పాటు అధికారంలో ఉంటామని ఆ పార్టీ చెప్పుకుంటోంది. మరో 50 ఏళ్లు పాలన చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని రెండు మెడికల్‌ కాలేజీలను ఆ పార్టీ అధ్యక్షుడు (భాజపా) వచ్చి పరిశీలిస్తే.. ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారనే విషయం వారికి తెలుస్తుంది’ అని ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. 

ఇటీవల పోలీస్‌ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన సింగ్‌ అనే వ్యాపారి గురించి ప్రస్తావించిన అఖిలేశ్‌.. కస్టోడియల్‌ మరణం పొందిన బాధిత కుటుంబీకులకు కోటి రూపాయల పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ఆ పార్టీ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో భాజపా వివక్షను పాటిస్తోందని దుయ్యబట్టారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతోన్న నేపథ్యంలో కాషాయ ప్రభుత్వ పాలనపైనా అఖిలేశ్‌ మండిపడ్డారు. లండన్‌, న్యూయార్క్‌ నగరాల నుంచి పెట్టుబడులు తెస్తామన్న భాజపా.. జిల్లాల నుంచి పెట్టుబడులను తెస్తోందని విమర్శించారు.

కాన్పుర్‌కు చెందిన ఓ వ్యాపారి (27) గతేడాది డిసెంబర్‌ 12-13 తేదీల మధ్య పోలీస్‌ కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలవల్లే అతడు చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఛాతీ, ముఖం, కాళ్లు, చేతులు, పాదాల్లోనూ గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు చిత్రహింసల వల్లే సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడంటూ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని