Gujarat Polls: భాజపా చేసింది తప్పే కదా.. వారిపై చర్య లేవి?:కాంగ్రెస్‌

ఎన్నికల ప్రచారం కోసం భాజపా చిన్నారుల్ని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈసీ తక్షణమే స్పందించి, భాజపా, ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Published : 26 Nov 2022 00:52 IST

దిల్లీ: గుజరాత్‌ ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. పార్టీలన్నీ విమర్శలు, ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్నాయి. అయితే, తాజాగా ఎన్నికల ప్రచారం కోసం భాజపా చిన్నారుల్ని ఉపయోగించుకుంటోందని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈసీ తక్షణమే స్పందించి, భాజపా, ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. భాజపా తీరుపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) కూడా చర్యలకు ఉపక్రమిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

‘‘గుజరాత్‌ ఎన్నికల ప్రచారం కోసం చిన్నారులను ఉపయోగించుకోవడం చాలా బాధాకరం. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారాయి. అవే వీడియోలను ఎన్నికల సంఘానికి కూడా అందజేశాం.’’ అని కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్‌ ఎన్నిసార్లు చెప్పినా భాజపా నేతలు పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. తమ ఫిర్యాదును ఎన్నికల సంఘం స్వీకరించిందని, అంశాన్ని లోతుగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని అన్నారు.

భారత్‌ జోడో యాత్రలో చిన్నారులు పాల్గొన్నారంటూ కాంగ్రెస్‌ పార్టీతోపాటు, ఆగ్రనేత రాహుల్‌ గాంధీపై చర్యలు తీసుకోవాలని యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత  ఎన్నికల సంఘాన్ని ఎన్‌సీపీసీఆర్‌ కోరిన సంగతి తెలిసిందే. అయితే, తాజా ఘటనలోనూ ఎన్‌పీపీఆర్‌సీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని