Telangana News: ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదు: ఈటల రాజేందర్‌

‘‘గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం మంచిది కాదని చెప్పాం. 20 ఏళ్ల అనుభవం ఉన్న శాసనసభ్యుడిగా స్పీకర్‌కు పదే పదే గుర్తు చేశాను. మా సీట్లో ఉండి నిరసన

Published : 09 Mar 2022 01:22 IST

హైదరాబాద్: ‘‘గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం మంచిది కాదని చెప్పాం. 20 ఏళ్ల అనుభవం ఉన్న శాసనసభ్యుడిగా స్పీకర్‌కు పదే పదే గుర్తు చేశాను. మా సీట్లో ఉండి నిరసన తెలిపితే సస్పెండ్ చేశారు. ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదు’’ అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని చేసిన ఆరోపణలపై ఈటల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు కట్టే పన్నుల మీద ప్రభుత్వాలు నడుస్తాయి తప్పితే.. కేంద్ర ప్రభుత్వం నిధులతో కాదనే విషయాన్ని హరీశ్‌రావు గుర్తించుకోవాలన్నారు.

‘‘బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు 20 రోజులకుపైగా జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం 7 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ప్రజలు గమనించాల్సిన విషయం. కిరాయి భవనాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి తప్పితే సొంత భవనాలు లేవు. పాఠశాలలు బంజరు దొడ్డిలా ఉంటే నాణ్యమైన విద్య అందుతుందా?రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక అంకెల గారడీ. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.37 వేల కోట్లు. గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టించి యువకులను మద్యానికి బానిస చేస్తున్నారు. యువశక్తి గంజాయి, లిక్కర్‌కి బానిస అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చకు సిద్ధం. బడ్జెట్‌పై నేను మాట్లాడితే బండారం బయట పడుతుందనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. నాకు చట్టం మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. సస్పెన్షన్‌పై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఈటల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని