Raghunandan: ఏ చట్టం ప్రకారం మంత్రి కాల్పులు జరిపారు?: రఘునందన్‌

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated : 14 Aug 2022 14:23 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ఏ చట్టం ప్రకారం మహబూబ్‌నగర్‌లో మంత్రి కాల్పులు జరిపారని నిలదీశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌ మాట్లాడారు. 

పర్సనల్‌ సెక్యూరిటీ నుంచి తుపాకీ తీసి కాల్చడమేంటని రఘునందన్‌ ప్రశ్నించారు. మంత్రికేమైనా గన్‌ లైసెన్స్‌ ఉందా? అని నిలదీశారు. ప్రాణహాని ఉందంటూ శ్రీనివాస్‌గౌడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించిందని.. అలాంటి వ్యక్తి పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (పీఎస్‌వో) వద్దే రబ్బర్‌ బుల్లెట్లు ఉంటే ఎమ్మెల్యేలమంతా ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. తమకు భద్రతగా ఉన్న గన్‌మెన్ల వద్ద ఉన్నవి రబ్బర్‌ బుల్లెట్లా? ఒరిజినల్‌ బుల్లెట్లా? అని ప్రశ్నించారు. దీనిపై డీజీపీయే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘‘బహిరంగ ప్రదేశాల్లో తుపాకీ కాల్చడం చట్టరీత్యా నేరం. ఈ విషయంలో డీజీపీ మూడు తప్పులు చేశారు. ఎస్పీ సమక్షంలో తుపాకీ పేలిస్తే దాన్ని ఇప్పటి వరకు సీజ్‌ చేయలేదు. మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశమున్నా పెట్టలేదు. ఆ తుపాకీని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపలేదు. ఎస్పీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? రిటైర్‌ అయ్యాక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి కోసం డీజీపీ ఆలోచిస్తున్నారా? దేనికోసం మౌనంగా ఉన్నారు?ఈ విషయంపై మాట్లాడేందుకు డీజీపీ కార్యాలయానికి ఎప్పుడు రమ్మంటారు? డీజీపీ నిజాయితీగా వ్యవహరించి తుపాకీని ఫొరెన్సిక్‌కు పంపాలి. లేనిపక్షంలో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తాం’’ అని రఘునందన్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని