MLA Sit-Ups: నన్ను క్షమించండి.. గుంజీలు తీసిన ఎమ్మెల్యే..!

ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మద్దతుదారులను క్షమించమని కోరుతూ ఏకంగా గుంజీలు తీసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Published : 23 Feb 2022 20:24 IST

యూపీ ఎన్నికల ప్రచారంలో ఘటన

సోన్‌భద్ర (యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. గతంలో చేసిన అభివృద్ధి పనులు, కొత్త హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మద్దతుదారులను క్షమించమని కోరుతూ ఏకంగా గుంజీలు తీయడం విశేషం. యూపీలోని సోన్‌భద్రలో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన భూపేష్‌ చౌబే రాబర్ట్స్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఎన్నికల్లోనూ పోటీలో ఉన్న ఆయన.. తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాడు. తాజాగా బూత్‌స్థాయి కార్యకర్తలు, బూత్‌ ఇంఛార్జీలు, ఏజెంట్లు, మద్దతుదారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన చౌబే, మరోసారి తనకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం కల్పించాలని కోరాడు. అంతేకాకుండా గత ఐదేళ్లలో తాను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరుతూ గుంజీలు తీశాడు. ‘నన్ను క్షమించమని మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా..’ అంటూ గుంజీలు తీయడం ప్రారంభించడంతో వేదికపై ఉన్న నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో సమావేశానికి హాజరైన కార్యకర్తలు కూడా అరుపులు, చప్పట్లతో ఆయనకు మద్దతు ప్రకటించారు.

ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్నాయి. నేటితో (ఫిబ్రవరి 23)తో నాలుగు విడతల పోలింగ్‌ ముగిసింది. రాబర్ట్స్‌గంజ్‌ నియోజకవర్గానికి మార్చి 7న ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని