Andhra News: జగన్‌ ఓడిపోతే అమరావతిలోనే ఉంటారని గ్యారంటీ ఏముంది?: జీవీఎల్‌

తెదేపా, వైకాపా నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌ గుర్తొస్తుంది.. లేదంటే హైదరాబాదే గుర్తొస్తుంది భాజపా ఎంపీ జీవీఎల్‌ ఆరోపించారు. 2024లో జగన్‌ ఓడిపోతే అమరావతిలోనే ఉంటారని గ్యారంటీ ఏముందన్నారు.

Updated : 24 Dec 2022 18:55 IST

అమరావతి: రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేయడం తప్ప కొత్త కంపెనీలను తీసుకొచ్చే ఆలోచన ఉందా? అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను భాజపా ఎంపీ జీవీఎల్‌ ప్రశ్నించారు. 2024లో జగన్‌ ఓడిపోతే అమరావతిలోనే ఉంటారని గ్యారంటీ ఏముందని నిలదీశారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో ఐటీ రంగం కుదేలైంది. ఐటీ రంగ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 0.1 శాతం. ఐటీ ఉత్పత్తుల్లో రాష్ట్రం ఎక్కడా కనిపించట్లేదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైన బాధ్యత ఉందా? ఉన్నవాళ్లను తరిమేయాలనే ఆలోచనే తప్ప.. వైకాపా ప్రభుత్వం కొత్త కంపెనీలను తెచ్చి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఎందుకు చేయట్లేదు? రాష్ట్రానికి చెందిన యువత తమ ప్రతిభతో 10 నుంచి 15శాతం ఐటీ రంగాన్ని నిర్దేశిస్తుంటే.. ఐటీ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రం అత్యంత ఘోరమైన స్థితిలో ఉందని, ఇదే విషయాన్ని నేను పార్లమెంట్‌లో జీరో అవర్‌లో ప్రస్తావించా. తెదేపా, వైకాపా నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌ గుర్తొస్తుంది.. లేదంటే హైదరాబాదే గుర్తొస్తుంది.  నిన్న జగన్‌ మాట్లాడుతూ.. నాపేరు జగన్‌..నేనిక్కడే ఉంటానని డైలాగులు కొట్టారు. గతంలో అమరావతి విషయంలోనూ అదే చెప్పారు. రాజధాని ఇక్కడే ఉంటుందన్న మాటకు కట్టుబడి లేరు. మరి ఈ మాటకు కట్టుబడి ఉంటారనే గ్యారంటీ ఏంటీ? ఎలాగు 2024లో అధికారం చేజారిపోతోంది. అప్పుడు కూడా అమరావతిలోనే ఉంటారా? దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలి’’ అని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని