Laxman: ‘ఎన్డీయేలోకి తెదేపా’ ప్రచారం.. లక్ష్మణ్‌ ఏమన్నారంటే?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగానే పోటీచేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు

Updated : 01 Sep 2022 16:15 IST

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీయేలోకి తెదేపా వస్తోందన్న ప్రచారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా లక్ష్మణ్‌ స్పందించారు. అది కేవలం ప్రచారమేనని చెప్పారు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్తామని వ్యాఖ్యానించారు. ఏపీలో సీఎం జగన్‌ పట్ల ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకుంటామన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే భాజపా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వాళ్లది పచ్చి అవకాశవాద మీటింగ్‌..

బిహార్‌లో ఇద్దరు సీఎంలు కేసీఆర్‌, నీతీశ్‌కుమార్‌ మధ్య జరిగింది పచ్చి అవకాశవాదుల సమావేశమని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఇంట గెలవడం చేతకాక బయటకు వెళ్లి రచ్చ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అదే విధానంతో ఆయన బిహార్‌ పర్యటన కొనసాగిందన్నారు. కేసీఆర్‌ వైఖరి చూస్తుంటే మజ్లిస్‌తోనే కాకుండా కాంగ్రెస్‌తోనూ ఆయన జతకడుతున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. తెరాస, కాంగ్రెస్‌ ఒకే తరహా విధానాలతో కొనసాగుతున్న కుటుంబ పార్టీలన్నారు.

అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోరు?

గల్వాన్‌ అమరవీరుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సహాయం చేయడంలో తప్పులేదని.. కానీ తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు కేసీఆర్‌కు ఎందుకు మనసు రావడం లేదని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు, కొండగట్టు మృతుల కుటుంబాల పట్ల ఎందుకు మమకారం లేదు? ప్రభుత్వ వైఫల్యంతో 26 మంది ఇంటర్‌ విద్యార్థులు చనిపోతే కేసీఆర్‌ ఎందుకు ఆర్థికసాయం చేయలేదు?’’ అని నిలదీశారు.

మునుగోడులో గెలుపు భాజపాదే

దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలోనూ భాజపా బలపడుతోందని.. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలిచే దశకు చేరుకుంటోందని లక్ష్మణ్‌ అన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెరాసకు చావుదెబ్బే తగిలిందని చెప్పారు.  మునుగోడు ఉప ఎన్నికలో ఎన్ని కుట్రలు చేసినా భాజపానే గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తుంటే కేసీఆర్‌ సహించలేకపోతున్నారని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని