MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్‌: ఎంపీ లక్ష్మణ్‌

ఎన్నికల ఏడాది కాబట్టే రైతుల మీద భారాస ప్రభుత్వం ఎనలేని ప్రేమ కనబరుస్తుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నిన వచ్చే ఎన్నికల్లో భారాస ఓటమి తప్పదని ఆయన అన్నారు.

Updated : 01 Apr 2023 16:36 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూఢ విశ్వాసాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. శ్రీరామనవమికి రాముడికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇవ్వలేని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్‌ మాత్రమేనని ఆయన విమర్శించారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌ భాజపా పాలిత రాష్ట్రాల్లో రూ.20కి పైగా పన్ను తగ్గిస్తే.. తెలంగాణలో కనీసం రూ.5 తగ్గించడానికి కేసీఆర్‌ సర్కార్‌కు మనసు రావట్లేదని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే దళితులపై కేసీఆర్, కేటీఆర్‌కు ప్రేమ పుట్టుకొస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. 

ఊసరవెల్లి రంగు మార్చినట్లు కేసీఆర్ తెరాస నుంచి భారాసగా మార్చారని.. ఎన్ని కుయుక్తులు పన్నిన ఆ పార్టీకి ఓటమి తప్పదని లక్ష్మణ్‌ అన్నారు. ఎన్నికల ఏడాది కాబట్టే రైతుల మీద ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయన్నారు. ప్రధాని మోదీ ఈ నెల 8న రూ.20,000 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు తెలంగాణలో శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. ఇవాళ ప్రపంచ దేశాలు సైతం సమస్యల పరిష్కారం కోసం మోదీ, భారత్ వైపు చూస్తున్నాయని లక్ష్మణ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని