Published : 03 Jul 2022 01:47 IST

BJP: మోదీ మరో 20ఏళ్ల పాటు పాలన అందించాలి... కార్యవర్గ భేటీలో నేతల అభిప్రాయం

హైదరాబాద్‌: హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాకు వెల్లడించారు. దేశంలో పేదల అభ్యున్నతి, మహిళా సాధికారిత, స్వతంత్రతను మన స్వాతంత్ర్య సమరయోధులు ఆశించారని.. ఇవాళ భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇలాంటి అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సామాజిక భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలపై చర్చించిన కార్యవర్గం.. ప్రజల ఆర్థిక స్వావలంబన దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు నడ్డా గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రపంచానికి, దేశ ప్రజలకు భారత్‌ అందించిన సేవలు అసమానమైనవని ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ.. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మూను ఎంపిక చేయడం పార్టీ తీసుకున్న మరో కీలక నిర్ణయమన్నారు. 

విపక్ష పార్టీలు అవినీతి అక్రమాల్లో మునిగి ఉంటే.. సమాజ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుపై గట్టిగా నిలబడిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు నడ్డా తన ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. రెండు కళ్ల విధానాలు దేశంలో చెల్లవని కార్యవర్గ సమావేశంలో చర్చించారు. బెంగాల్‌, కేరళలో కార్యకర్తలను చంపుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కార్యవర్గం.. వారి సేవలను జ్ఞప్తికి తెచ్చుకుని నివాళులర్పించింది. దేశ వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై కృషిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతిపక్షాలు మోదీపై ఉన్న వ్యతిరేకతను దేశ ప్రజలకు నష్టం కలిగించేలా ఉపయోగించుకుంటున్నాయని కార్యవర్గం అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్రమోదీ 8ఏళ్ల పాటు కాదు.. మరో 20ఏళ్ల పాటు పాలన అందించాలని కోరుకుంటున్నామని పలువురు నేతలు అభిప్రాయపడ్డారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ‘‘ప్రధానిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించకుండా కేసీఆర్‌ రాజకీయ మర్యాదను మర్చిపోయారు. రాజ్యాంగ పరంగా, రాజకీయంగా, సంస్కృతి పరంగా ఆయన ఉల్లంఘించారు. కేసీఆర్ వ్యక్తిని అవమానించలేదు... ప్రధాని పదవిని అవమానించారు’’ స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని