BJP: తొలిరోజు రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై చర్చించిన భాజపా జాతీయ కార్యవర్గం

హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి రోజు ముగిశాయి. సమావేశంలో  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశ పెట్టిన ...

Updated : 03 Jul 2022 06:39 IST

హైదరాబాద్: హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి రోజు ముగిశాయి. సమావేశంలో  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశ పెట్టిన రాజకీయ  తీర్మానంపై చర్చ జరిగింది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు, వచ్చే ఏడాది కర్ణాటక, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యవర్గం చర్చించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టగా... మరో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమర్థించారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద వివిధ పథకాలు విజయవంతమయ్యాయని నేతలు పేర్కొన్నారు.

కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం పనిచేశాయని అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్యం కోసం 25 నెలల్లో రూ.2.60లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎగుమతులు పెరిగాయని, వృద్ధిరేటు పెరిగిందని వివరించారు. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తులలో భారత్‌ 6వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరించారు. గతంలో విధానపరమైన లోపాల నుంచి రెండంకెల వృద్ధికి చేరుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. పోలియో వ్యాక్సిన్‌ వేసేందుకు గత ప్రభుత్వాలకు 30 ఏళ్లు పట్టిందని, ఇప్పుడు కేవలం ఏడాదిలో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ డోసులు వేయగలిగామన్నారు. దేశం సుస్థిర అభివృద్ధి చూసి ప్రపంచంలోని పెట్టుబడులు భారత్‌కు వస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని