Tarun Chugh: ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్‌ విమర్శించారు.

Updated : 15 Jun 2024 06:33 IST

తెలంగాణలో ఎన్నికల ఫలితాలే నిదర్శనం
భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్‌

బండి సంజయ్‌తో భేటీ అయిన భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్‌

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్‌ విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణలో భాజపా 35 శాతం ఓట్లు, 8 లోక్‌సభ స్థానాలను సాధించడం సంతోషకరం. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. అందుకు పార్లమెంటు ఎన్నికలే నిదర్శనం. అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. వాటిని అమలుచేయకుండా ప్రజలకు ద్రోహం చేస్తోంది. రాష్ట్రంలో భారాస పనైపోయింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే అన్నది ఈ ఎన్నికలతో రుజువైంది’’ అని ఆయన పేర్కొన్నారు. హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్‌ ఆ శాఖకు మంచిపేరు తీసుకురావడంతో పాటు, ప్రజలకు మరింత మేలు జరిగేలా పనిచేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ అసెంబ్లీలో భాజపాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాంనాయక్, బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, తెలంగాణ కేడర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కేంద్రమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్రపతిని కలిసిన కిషన్‌రెడ్డి..

 కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌లను మర్యాదపూర్వకంగా కలిసి వారికి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. కొత్త మంత్రిత్వశాఖ బాధ్యతలను చేపట్టిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని