ఓటమి భయంతోనే డబ్బులు పంచుతున్నారు: డీకే అరుణ

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు.

Published : 03 Nov 2020 00:53 IST

హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. సోమవారం సిద్దిపేటలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణపై ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో మా కార్యకర్తలు స్వర్ణ ప్యాలెస్‌కు వెళ్లారు. సిద్దిపేట జిల్లాతో సంబంధంలేని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కడ ఏం చేస్తున్నారు? ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా పోలీసులు దీనిపై ఎందుకు స్పందించడం లేదు. తెరాస నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా? డబ్బులు పంచుతూ.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న తెరాస నాయకులను అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై దాడి చేయడం ఏమిటి? నీతులు చెప్పే మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచేందుకు తెరాస నాయకులు ఏ స్థాయికైనా దిగజారుతారా?’’ అని డీకే అరుణ ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెరాస నాయకులపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు చేపట్టాలని డీకే అరుణ కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని