BJP: ఎన్డీయే శ్రేణుల సమష్టి కృషితోనే గెలిచాం

ఎన్డీయే శ్రేణుల సమష్టి కృషి, సంయమనం, సమన్వయం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినట్లు భాజపా రాష్ట్ర నేతలు, గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వెల్లడించారు.

Published : 21 Jun 2024 04:35 IST

భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేల వెల్లడి
విజయవాడలో అభినందన సభ

అభినందన సభలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, వేదికపై కామినేని శ్రీనివాస్, సత్యకుమార్,
సోము వీర్రాజు, పురందేశ్వరి, సీఎం రమేశ్, సుజనాచౌదరి, ఈశ్వరరావు, ఆదినారాయణరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథి

ఈనాడు, అమరావతి: ఎన్డీయే శ్రేణుల సమష్టి కృషి, సంయమనం, సమన్వయం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినట్లు భాజపా రాష్ట్ర నేతలు, గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వెల్లడించారు. రాష్ట్రంలో 8 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో గెలుపు వెనుక తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తల శ్రమ ఉందని పేర్కొన్నారు. భాజపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులకు విజయవాడలో గురువారం రాత్రి అభినందన సభ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ కేవలం బటన్‌ నొక్కుడు కాకుండా, అభివృద్ధితో కూడిన సంక్షేమం అందిస్తేనే ప్రజలు ఆశీర్వదిస్తారన్న సంగతి ఈ ఎన్నికల్లో స్పష్టమైందని, భవిష్యత్తు పాలనకు ఈ ఫలితాలు కేసు స్టడీగా పనికొస్తాయని తెలిపారు. ఎన్డీయే మిత్రపక్ష ధర్మాన్ని పాటిస్తూనే, ప్రజా సమస్యల పరిష్కారానికి భాజపా ప్రజాప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ‘అధిష్ఠానం ఎంపీ అభ్యర్థిగా టికెట్‌ ఇచ్చినప్పుడు నాకు అంతటి ఆర్థిక స్తోమత లేదని, అభ్యర్థిత్వంలో మార్పు జరుగుతుందని, మరొకరికి ఈ స్థానాన్ని ఇవ్వబోతున్నారని రకరకాల ప్రచారం జరిగింది. కార్యకర్తగా ఉన్న నాపై జాతీయ నాయకత్వం నమ్మకం ఉంచింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరూ నా విజయానికి కృషి చేశార’ని కృతజ్ఞతలు తెలిపారు.

ఆరోగ్య రంగం ఘోరం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ కార్యకర్తల భిక్ష వల్లే తాము ఈ స్థాయికి వచ్చామన్నారు. ‘రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఐదేళ్లుగా అనారోగ్యంతో ఉంది. ఈ శాఖలో కేంద్ర నిధులు దారి మళ్లించారు. అధికారులు అప్పుల బిల్లుల వివరాలు చెబితే ఆందోళన కలిగింది. సమస్యలను అధిగమించి, అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. నాతోపాటు ఆదినారాయణరెడ్డి సాధించిన గెలుపు.. మాజీ సీఎం జగన్‌ను శాండ్‌విచ్‌ చేసినట్లయింది’ అని వ్యాఖ్యానించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ ప్రసంగిస్తూ గతంలో మాదిరిగా ఈ ఎన్నికల్లో రెబల్స్‌ ఎక్కడా లేరని గుర్తుచేశారు. వైద్య ఆరోగ్య శాఖలో నిధుల దుర్వినియోగంపై మంత్రి సత్యకుమార్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శాసనసభ సమావేశాల్లో వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలను ఆటాడుకుంటామని, ఆ పార్టీ ఇక కోలుకోదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సుజనాచౌదరి మాట్లాడుతూ ‘అనూహ్యంగా నాకు టికెట్‌ దక్కింది. మినీ ఇండియాగా ఉండే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తక్కువ వ్యవధిలోనే సమష్టి కృషితో పని చేయడం వల్ల అన్నివర్గాల ఆదరణ లభించింది. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాష్ట్రంలో 50 అసెంబ్లీ స్థానాలు అదనంగా రాబోతున్నాయ’ని చెప్పారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఆదోనిలో భాజపా పోటీ చేయడంపై తొలుత చాలామంది సంశయించినప్పటికీ, పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణే తనను గెలిపించిందని అక్కడి ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిజమైన స్వాతంత్య్రం ఎలా ఉండాలో ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ద్వారా కనిపించిందన్నారు. అనూహ్య పరిణామాల్లో అనపర్తి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, అందరి సహకారం వల్లే గెలిచానని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో తన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు తక్కువగా ఉన్నా, విజయం సాధించానంటే భాజపాపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే కారణమన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని