Bandi sanjay: భయపడొద్దు.. వచ్చేది భాజపా ప్రభుత్వమే: బండి సంజయ్‌

రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ఆ పార్టీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉందన్నారు.

Updated : 29 Nov 2022 18:04 IST

భైంసా: రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మిగులు నిధులతో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్‌ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా భైంసా సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల కోసం భాజపా ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉంది. అక్కడి కాంట్రాక్టర్‌ కేసీఆర్‌ చుట్టం కాబట్టే విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారు. నిర్మల్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో సీఎం ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితే మరో రూ.5లక్షల కోట్లు అప్పు చేస్తారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని భాజపా హామీ ఇచ్చింది. భాజపాకు ఒక్కసారి అవకాశమివ్వండి. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముథోల్‌ నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలో నిలువనీడలేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉంది. భైంసాలో హిందూ సమాజం భయపడాల్సిన అవసరం లేదు.. భాజపా వారికి అండగా ఉంటుంది’’ అని బండి సంజయ్‌ తెలిపారు.

కేసీఆర్‌ పతనం ప్రారంభమైంది: కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పతనం ప్రారంభమైందన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో.. కేసీఆర్‌ ఒక్క ఎంపీ సీటైనా గెలుస్తారా? అని ప్రశ్నించారు. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా... వెయ్యి మంది అసదుద్దీన్‌ ఒవైసీలు వచ్చినా నరేంద్రమోదీ నాయకత్వాన్ని అడ్డుకోలేరన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. కేసీఆర్‌ చేస్తున్న అవినీతి కుంభకోణాలపై భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా దర్యాప్తు చేయిస్తుందన్నారు. సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, సోయం బాపూరావుతో పాటు పలువురు నేతలు సభలో పాల్గొన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని