Published : 27 Jun 2022 11:23 IST

Maharashtra: ఒక్కో ఎమ్మెల్యే రూ.50కోట్లకు అమ్ముడుపోయారు..

స్క్రిప్ట్‌ అంతా భాజపాదే.. శివసేన సంచలన ఆరోపణలు

ముంబయి: శివసేనపై తిరుగుబావుటా ఎగురవేసిన అసమ్మతి ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. భాజపా అసలు రంగు బయటపడిందంటూ దుయ్యబట్టింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.50కోట్లకు అమ్ముడుపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో గువాహటిలో ఉన్న అసమ్మతి నేతల బృందంలో 15 మంది శివసేన శాసనసభ్యులకు సీఆర్పీఎఫ్‌ బలగాలతో ‘వై ప్లస్‌’ భద్రత కల్పించాలని కేంద్రం ఆదివారం నిర్ణయించింది. వారికి ప్రాణహాని ఉండొచ్చన్న కేంద్ర సంస్థల అంచనా మేరకు ఈ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక, మహారాష్ట్రలో వారి కుటుంబసభ్యులకూ రక్షణ ఉండేలా గృహాల వద్ద భద్రత బృందాలను నియమించింది.

కేంద్రం చర్యలపై స్పందించిన శివసేన తమ సామ్నా సంపాదకీయంలో భాజపాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘భాజపా అసలు రంగేంటో ఇప్పుడు బయటపడింది. శివసేనలో తిరుగుబాటు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని కాషాయ పార్టీ పైకి చెబుతోంది. కానీ, తెరవెనుక ఏక్‌నాథ్‌ శిందే, దేవేంద్ర ఫడణవీస్‌ వడోదరలో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత కేంద్రం వెంటనే రెబల్‌ ఎమ్మెల్యేలకు వై ప్లస్‌ భద్రత కల్పించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలకు భాజపానే కారణమని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఉంటుందా..? భాజపానే ఆ నటులకు(రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ) స్క్రిప్ట్‌ రాసి ఈ మొత్తం నాటకానికి దర్శకత్వం వహించింది’’ అని శివసేన దుయ్యబట్టింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.50కోట్లకు అమ్ముడుపోయారంటూ పార్టీ ఆరోపించింది. రెబల్‌ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి తిరిగొస్తే మళ్లీ వారు శివసేనలో చేరుతారని కేంద్రం భయపడుతోందా? అని ప్రశ్నించింది.

కారు నిండా డబ్బుతో..

ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో అసమ్మతి నేతల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సమయంలో శివసేన ఎమ్మెల్యే ఒకరు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. శిందే వర్గం తనకు రూ.50కోట్లు ఆఫర్‌ చేసినట్లు కన్నాడ్‌ ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆరోపించారు. ‘‘తిరుగుబాటు చేసిన శిందే శిబిరం నన్ను కూడా తమతో పాటు రమ్మని ఒత్తిడి చేసింది. పదే పదే ఫోన్లు చేసి నన్ను బలవంతపెట్టేందుకు వారు ప్రయత్నించారు. దీంతో నేను ఫోన్ స్విచ్చాఫ్‌ చేసుకున్నా. ఆ తర్వాత కొంతమంది కారులో నా దగ్గరకు వచ్చారు. అందులో రూ.50కోట్ల డబ్బు ఉన్నట్లు చెప్పారు. కానీ నేను వారికి ఒకటే చెప్పాను. ఠాక్రే కుటుంబం, శివసేన పార్టీకి నేనెప్పుడూ విధేయుడిగానే ఉంటానన్నాను’’ అని ఉదయ్‌ సింగ్ వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts