BJP: గహ్లోత్‌ నోట్సులో ‘ఎస్పీ’ ఎవరో..?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక, రాజస్థాన్ సంక్షోభం వేళ.. అధినేత్రి సోనియా గాంధీతో సమావేశానికి ఆ పార్టీ నేత అశోక్‌ గహ్లోత్ రాసుకొచ్చిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. 

Published : 02 Oct 2022 01:30 IST

దిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన వేళ.. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్ ఆమెతో చర్చించేందుకు రాసుకొచ్చిన అంశాలు బయటకువచ్చాయి. అవి తాజాగా వైరల్ కావడంతో భాజపా ట్విటర్ వేదికగా తనదైనశైలిలో కామెంట్లు చేసింది.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక, రాజస్థాన్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల గహ్లోత్‌.. సోనియాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణలు తెలియజేశారు. అలాగే పార్టీ అధ్యక్ష బరి నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. అయితే ఈ సమావేశానికి గహ్లోత్‌ తన వాదనను వినిపించడానికి పూర్తిగా సిద్ధమై వచ్చినట్టు సమాచారం. దానికి సంబంధించిన నోట్స్‌ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని మలయాళ మనోరమ ఫొటోగ్రాఫర్ సంపాదించినట్లు తెలుస్తోంది. ఎస్పీ పార్టీని వీడతారు. దీనిపై పరిశీలకులు ముందుగానే నివేదిక ఇచ్చి ఉంటే, పార్టీకి మేలు జరిగేది. ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తనవంతు ప్రయత్నించిన మొదటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 102 వర్సెస్‌ ఎస్పీ+18’ అంటూ ఆ నోట్స్‌లో రాసుంది. దానిని భాజపా ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ఎస్పీ ఎవరు..? అని ప్రశ్నించింది.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం గహ్లోత్, సచిన్‌ పైలట్ వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఒక దశలో పైలట్ తన వర్గంతో తిరుగుబావుటా కూడా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ..తన సొంత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రపన్నారంటూ దీనిపై గహ్లోత్‌ వర్గం పైలట్‌ను విమర్శిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. మొదటి నుంచి పార్టీ అధ్యక్ష పదవికి ముందువరుసలో ఉన్న గహ్లోత్‌.. ముఖ్యమంత్రి పీఠంవైపే అమితాసక్తి చూపడంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని