
Sachin Pilot: ధరలు మండిపోతున్నాయ్.. ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు..!
కేంద్రంపై సచిన్ పైలట్ ఫైర్
జైపూర్: దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి రంగంలోనూ కేంద్రం దేశాన్ని మోసం చేస్తోందని ఆరోపించారు. జైపూర్ సమీపంలోని చాక్సు వద్ద నిర్వహించిన దళిత్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘గత ఏడేళ్లుగా భాజపా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. నిరుద్యోగం రికార్డుస్థాయికి చేరింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు చాలా ఖరీదైపోయాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది’’ అని మండిపడ్డారు.
ఈ కార్యక్రమం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పైలట్ ఆవిష్కరించారు. పుండు మీద కారం చల్లినట్టుగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. వీటిపై రైతులు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారన్నారు. సాధ్యమైనంత వరకు రాష్ట్రంలోని తమ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతికి అవకాశం కల్పిస్తాయన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన మంత్రి భన్వర్‌లాల్ మేఘ్వాల్ స్థానంలో దళిత వ్యక్తికి కేబినెట్లో చోటుకల్పిస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో అనుబంధం లేకపోయినా కొందరు ఆయన పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకొంటున్నారని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్, సర్ధార్ పటేల్‌ను చూడని వారు ఓట్లు, అధికారం కోసం వారిని ఆరాధిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.