TS News: రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారు: బండి

రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరోపించారు.

Updated : 09 Jan 2022 17:23 IST

హనుమకొండ: రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరోపించారు. 317 జీవోకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భాజపా ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటు చేసిన నిరసన సభలో అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మతో కలిసి బండి సంజయ్‌ పాల్గొన్నారు. అసోం చిన్న రాష్ట్రమైనా తెలంగాణ కంటే అద్భుతంగా పనిచేస్తోందని హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల ఆదాయం ఉన్నా.. తెరాస సర్కారు ఒక కుటుంబం కోసమే పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కమలం జెండా ఎగురవేస్తామని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. బదిలీలకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలిపితే ఎన్ని పరిశీలించారో.. ఎన్ని పరిష్కరించారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా కార్యకర్తలు తెగించి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో ముఖ్యమంత్రి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. 10వ తేదీ వచ్చినా 13 జిల్లాల్లో ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం అనేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని బండి సంజయ్‌ గుర్తు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని