బెంగాల్‌ పాలిటిక్స్‌: 200స్థానాల్లో గెలుస్తాం!

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికారాన్ని సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి.

Published : 05 Mar 2021 01:08 IST

ధీమా వ్యక్తం చేస్తోన్న భాజపా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికారాన్ని సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో 294 శాసనసభ స్థానాలున్న అసెంబ్లీలో 200లకు పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని భాజపా రాష్ట్ర నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

‘మాకు 200 స్థానాల కంటే తక్కువ సీట్లు రావు. రెండు వందలకు పైగా స్థానాల్లో గెలిచి తీరుతాం. ఇందుకు మేము ఇప్పుడే ఏర్పాట్లు ప్రారంభించలేదు. ఐదు సంవత్సరాల క్రితమే మా ప్రయత్నాలను మొదలుపెట్టాం’ అని పశ్చిమ బెంగాల్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ స్పష్టంచేశారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సగం సీట్లు సాధించామని, ప్రస్తుతం ఎన్నికల్లో పూర్తిగా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. 2014లో కేవలం రెండు పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపొందిన భాజపా, క్రిందటి లోక్‌సభ ఎన్నికలల్లో ఏకంగా 18స్థానాల్లో విజయం సాధించింది. అధికార తృణమూల్‌ మాత్రం భాజపా కంటే అదనంగా కేవలం మూడు సీట్లు మాత్రమే పొందగలిగింది.

ఆర్‌జేడీ-తృణమూల్‌?

రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్న భాజపాను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తోన్న మమతా బెనర్జీకి తాజాగా ఆర్‌జేడీ మద్దతు లభించింది. ఆర్‌జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్‌ రెండు రోజుల క్రితమే మమతా బెనర్జీని కలిశారు. వచ్చే ఎన్నికల్లో తృణమూల్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. లాలు ప్రసాద్‌ యాదవ్‌ నిర్ణయం ప్రకారమే మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్నామని, రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అంశమని తేజస్వీ యాదవ్‌ వెల్లడించారు.

కాంగ్రెస్‌ పరిస్థితి అంతంతే..

బెంగాల్‌ రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపించని కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిగి బరిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా ఈసారి కాంగ్రెస్‌ కేవలం 90స్థానాల్లోనే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌రంజన్‌ చౌదురి పేర్కొన్నారు. అయితే, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ వంటి పార్టీలు తమతో కలిసి వస్తాయని ఆశించిన కాంగ్రెస్‌కు చుక్కెదురే అయ్యింది. తాజాగా ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రిని కలిసి తన మద్దతును తెలపడంతో కాంగ్రెస్‌ కూటమికి నిరాశే ఎదురయ్యింది.

ఇదిలాఉంటే, బెంగాల్‌లో 100కంటే ఎక్కువ స్థానాల్లో భాజపా గెలవదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి స్పష్టంచేశారు. ఒకవేళ భాజపా వంద కంటే ఎక్కువ సీట్లు సాధిస్తే ప్రస్తుతం తాను చేస్తున్న పనినుంచి పూర్తిగా తప్పుకుంటానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బెంగాల్‌ భాజపా రాష్ట్ర కార్యవర్గం 200 సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని