మా బంధం ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు వంటిది!

భాజపా-శివసేన బంధం భారత్‌-పాక్‌ వంటిది కాదని.. మాది ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు వంటిదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పోల్చి చెప్పారు.

Updated : 23 Feb 2024 18:25 IST

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

దిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తిగా మారుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే అధికారంలో ఉన్న శివసేన, ప్రతిపక్ష భాజపా మధ్య స్నేహం మరోసారి చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరుపార్టీల స్నేహంపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. భాజపా-శివసేన బంధం భారత్‌-పాక్‌ వంటిది కాదని.. మాది ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు వంటిదని పోల్చి చెప్పారు. ఇరుపార్టీల దారులు వేరైనా.. స్నేహభావం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భాజపా, శివసేన శత్రువులు కావని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్న నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘భాజపా, శివసేన మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఇరు పార్టీలు శత్రువులు కావు. ఎన్నికల సమయంలో శివసేన మాతో కలిసి పోటీ చేసింది. ఫలితాల తర్వాత మాత్రమే ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో జతకట్టింది’ మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఇరుపార్టీల స్నేహాన్ని గుర్తుచేశారు. ఇదే సమయంలో ‘భాజపా, శివసేన పార్టీలు శత్రువులు కాదు. ఇది వందశాతం వాస్తవం. కానీ, దీనర్థం ఇరుపార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కాదు’ అని మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. ఇలా భాజపా నేతల వ్యాఖ్యలపై స్పందించిన శివసేన.. ఇరు పార్టీల మధ్య దూరం లేదని విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసింది.

ఇదిలాఉంటే, మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (105), శివసేన (56) కలిసి మెజారిటీ సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి పీఠంపై ఇరు పార్టీలు వెనక్కి తగ్గకపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో భాజపా నుంచి బయటకువచ్చిన శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో జతకలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సమీకరణాలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని