
‘ధరణి’ వెనక్కి తీసుకోండి : భాజపా
హైదరాబాద్ : ధరణి పోర్టల్ వల్ల రిజిస్ట్రేషన్లు అస్తవ్యస్తంగా మారాయని భాజపా సీనియర్ నేత మురళీధర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం కొన్ని నెలలుగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిందన్నారు. ధరణి వెబ్సైట్ ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు చేయలేదని విమర్శించారు. ధరణి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్రానికి రెవెన్యూ విషయంలో తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా బిల్డర్లు ఇక్కట్లకు గురవుతున్నారని మురళీధర్ రావు పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 16 లక్షల రిజిస్ట్రేషన్ లు జరిగేవని.. అందులో 80 శాతం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లే ఉండేవని గుర్తు చేశారు. తెరాస ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి ఆటోమేటిక్ మ్యుటేషన్, మరో రెండు రకాల ఫీచర్లను అడ్వాన్స్ డ్ ఫీచర్ గా చెబుతోందని దీని వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా మారిందని తెలిపారు.
దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ధరణి స్వర్గధామంలా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ధరణి పోర్టల్‌లో లింక్ డాక్యుమెంట్ల వివరాలు లేవన్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుక్ చేసిన తర్వాత అత్యవసర పరిస్థితులు తలెత్తి రిజిస్ట్రేషన్ కు హాజరుకాలేకపోతే స్లాట్ రద్దవుతుందని, దీని వల్ల బుకింగ్ ముందు కట్టిన స్టాంప్ డ్యూటీ మళ్లీ చెల్లించాల్సి వస్తుందన్నారు. వంద రకాల దస్తావేజులు ఉన్న చోట కేవలం మూడు మాత్రమే ధరణిలో కనిపిస్తున్నాయన్నారు.
సెక్షన్ 22aలో ఉన్న కారణాల వల్ల తప్ప మరే ఇతర కారణాలతోనూ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ లు ఆపే హక్కు సబ్ రిజిస్ట్రార్ కు లేదని మురళీధరరావు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ‘ధరణి’ పోర్టల్ వెంటనే వెనక్కి తీసుకొని పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని మురళీధరరావు డిమాండ్ చేశారు.